కూటమి ప్రభుత్వంపై ఉద్యమాలు
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
కర్నూలు(అర్బన్): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కూటమి ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూనే ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సీపీఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ మీదుగా సీపీఐ కార్యాలయం సీఆర్ భవన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చి విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను మోసం చేశారన్నారు. సొంత ఇల్లు లేని పేదవారికి పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పిన హామీపై ఇంత వరకు అతీగతీ లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పల్లె దీవెన, రైతు బంధు పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చి ఆరు నెలలు గడిచినా అమలు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పోరుబాటలో భాగంగా 2 నుంచి 10వ తేదీ వరకు పేద వారికి ఇంటి స్థలాలు, సొంత స్థలాలు ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నామన్నారు.
ధరలను అదుపు చేయలేని బీజేపీ..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధరలను అదుపు చేయడం లేదని రామకృష్ణ ఆరోపించారు. బీజేపీ నేతలు మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకుని పబ్బం గడుపుకుంటున్నారన్నారు. రైతుల కష్టాలు తీర్చడం లేదని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. పార్లమెంట్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్‌ను అవమానపరిచారన్నారు. వీరికి రాజ్యాంగం పట్ట నమ్మకం కూడా లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అంబేడ్కర్‌ను అవమానించిన ఘటనలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే రామాంజనేయులు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్‌బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కే జగన్నాథం, సహాయ కార్యదర్శి ఎస్. మునెప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment