ఉద్యోగమే లక్ష్యంగా బరిలోకి..
కర్నూలు: తలపై టోపీ... చేతిలో లాఠీ... ఒంటిపై ఖాకీ డ్రస్సుతో పోలీసుగా తమను తాము చూసుకోవాలనేది చాలామంది కల. దీనిని సాకారం చేసుకోవడమే లక్ష్యంగా పలువురు అభ్యర్థులు పోలీసు కానిస్టేబుల్ ఎంపిక పరీక్షల్లో బరిలో దిగి ప్రతిభ కనబరిచారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం ఉమ్మడి జిల్లాకు చెందిన 600 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 266 మంది హాజరయ్యారు. వారికి ఎత్తు, ఛాతీ విస్తీర్ణం తదితర పరీక్షలు నిర్వహించి అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి మైదానంలోకి అనుమతించి పరుగు, లాంగ్‌జంప్ పోటీలు జరిపారు. కొంతమంది సంబంధిత ధ్రువపత్రాలు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. మరికొంతమంది కొలతలు సరిపోక అనర్హులయ్యారు. ముందుగా 1600 మీటర్ల పరుగు పందెంలో నిర్ణీత సమయానికి చేరుకున్న వారికి 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి అర్హత పత్రాలు అందజేశారు. తుది రాత పరీక్షకు 197 మంది ఎంపికయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ పూర్తి కాగా ఫలితాల పత్రాలను అందించడం ఆలస్యమైంది.
వివరాలు కంప్యూటర్‌లో నిక్షిప్తం...
పోలీసు అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య, పరుగు పందెంలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్‌లో నమోదు చేసి భద్రపరుస్తున్నారు. బయోమెట్రిక్ పూర్తి చేసిన తర్వాత ప్రతి అభ్యర్థి కాలికి చిప్‌తో కూడిన రిస్ట్ బ్యాండ్ తగిలించుకుని పోటీల్లో పాల్గొన్నారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రాథమిక ఎంపిక రాత పరీక్షలు పూర్తి చేయగా తాజాగా అధికారులు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు సెలవు దినాలు మినహా ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది. కేటాయించిన తేదీల్లో గైర్హాజరైనవారికి చివరిలో మరో అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలకు రెండో
రోజు 266 మంది హాజరు
తుది రాత పరీక్షకు 197 మంది ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment