● ఉదయం గంటన్నర పాటే ఇంటిదగ్గర పింఛన్ల పంపిణీ ● తర్వాత సచివాలయాలు, రచ్చబండల దగ్గర అందజేత ● వికలాంగులు, వయోవృద్ధులకు తప్పని కష్టాలు
కర్నూలు(అగ్రికల్చర్)/ నంద్యాల (అర్చన్): ఇంటి దగ్గరే పింఛన్ల పంపిణీ మాటలకే పరిమితమైంది. జనవరి నెలకు సంబంధించిన పంపిణీ కూడా సచివాలయాలు, రచ్చబండల దగ్గరే జరిగింది. 1వ తేదీ నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండటంతో ఒకరోజు ముందుగానే అంటే ఈనెల 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మంగళవారం ఉదయం కొద్దిసేపు వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇంటి దగ్గర పంపిణీ జరగగా ఆ తర్వాత యథాప్రకారం సచివాలయాలు, రచ్చ బండల దగ్గరకు మారింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పింఛన్ల పంపిణీ జరగడం ఏడో సారి.అయితే ఇప్పటి వరకు ఒకసారి కూడా పూర్తిస్థాయిలో ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీ విజయవంతంగా జరగలేదు. దీంతో వేలాది మంది వికలాంగులు, వయోవృద్ధులు, కిడ్ని బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో వలంటీర్లు ఐదేళ్లు లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్ సొమ్ము అందజేశారు. దీంతో అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధి గ్రస్తులు ఎవరూ ఇబ్బంది పడలేదు. తెలుగుదేశం, జనసేన పార్టీల కుట్రల వల్ల ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పింఛన్‌దారులకు కష్టాలు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వలంటీర్లను తొలగించారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి దగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. అయితే, అమలు మాత్రం తూతూ మంత్రంగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కర్నూలులో 95.95,నంద్యాలలో 95.78 శాతం పంపిణీ...
జనవరి నెలకు సంబంధించి ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కర్నూలు జిల్లా 8వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 2,39,818 పింఛన్‌దారులుండగా.. సాయంత్రం 6 గంటల సమయానికి 2,30,108 (95.95 శాతం)మందికి పింఛన్ అందజేశారు. నంద్యాల జిల్లాలో 2,16,111 పింఛన్లు ఉండగా...2,06,983 పంపిణీ చేశారు. 95.78 శాతం పంపిణీ జరిగింది. మిగిలి న లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మైనార్టీ, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో మంగళవారం ఆయన పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment