మాట వినకపోతే అంతే!
అక్కడ అధికారులెవరైనా నిబంధనలు పక్కన పెట్టాలి. అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు వినాలి. వారి అడుగులకు మడుగులొత్తాలి. రాజకీయ ప్రత్యర్థులకు పనులు చేయకూడదు. గిట్టనోళ్లపై కేసులు పెట్టి వేధించాలి. అవసరమైతే గ్రామ బహిష్కరణ చేయాలి. అంతేకాదు అధికార పార్టీ వారు అనుమతులు లేకుండా మట్టి తవ్వినా.. కొండలు కరిగించి సొమ్ము చేసుకున్నా కిమ్మనకూడదు. అడిగిన చోట సంతకాలు చేయాలి.. అసైన్డ్, పోరంబోకు భూములు కట్టబెట్టాలి. కాదంటే కుర్చీలో కూర్చోలేరు. వేధింపులు భరించలేరు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సాగుతున్న తంతు ఇదీ.
ఆళ్లగడ్డ: నియోజకవర్గంలో అధికారులపై టీడీపీ నేతల ఒత్తిళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. బదిలోల్లో భాగంగా పోస్టులకు రూ. లక్షలు ముట్టజెప్పి వచ్చిన అధికారులు తాము చెప్పినట్లు వినాల్సిందేనని నేతలు, ప్రజా ప్రతినిధులు పట్టుబడుతుండటంతో విధుల నిర్వహణకు అధికారులు హడలి పోతున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిళ్లలను తట్టుకోలేక సతమతమవుతున్నారు. తాజాగా రూరల్ సీఐ కంబగిరిరాముడిపై చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కారు. సదరు అధికారి చిన్నవంగళి పాలకేంద్రం ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వచ్చిన తమ ప్రత్యర్థులను అడ్డుకోలేదనే అక్కసుతో ఓ రౌడీషీటర్, మరి కొంత మంది టీడీపీ నేతలు ఏకంగా పోలీస్ కార్యాయం ఎదుటే ధర్నాకు దిగారు. పోలీసు జులుం నశించాలి, సీఐ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన పట్ల మనసు నొచ్చుకున్న పోలీసు అధికారులు తాము ఎంత చేసినా చివరకు ఇలా చేయడం ఏంటని చర్చించుకున్నట్లు తెలుస్తోంది. పోలీస్ అధికారులకే ఈ పరిస్థితి ఎదురైతే తమ పరిస్థితి ఏంటని ఇతర అధికారులు ఆందోళన చెందుతున్నారు.
దీర్ఘకాలిక సెలవుపై కమిషనర్
మునిసిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటరామిరెడ్డికి కొంత కాలం క్రితం ఓ దుకాణ యజమాని చెప్పినట్లు వినడం లేదని అతని దుకాణాన్ని ఎలాగైనా మూసేయించాలని టీడీపీ నాయకుల హుకుం జారీ చేశారు. దీంతో ఆయన అతనికి నోటీసులు ఇచ్చా రు. అయితే దుకాణదారుడు కోర్టుకు పోయి అనుమతి తెచ్చుకున్నాడు. అయినా, టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి పోవడంతో కమిషనర్‌ను మందలించగా విధిలేక అనుమతి ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన నేత ఇంటికి పిలిపించుకుని దుర్భాషలాడి వెంటనే సెలవు పెట్టి పోవాలని హుకుం జారీ చేయడంతో అప్పటికప్పుడు సెలవుపై వెళ్లి పో వడం జరిగింది.
ఎవరో చేసిన పనికి సస్పెండైన ఏఈ
హౌసింగ్ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇసుకను అఽధికార పార్టీ నేతలు రాత్రికి రాత్రి తరలించుకు పోయారు. ఈ విషయం తెలియ జేసినప్పటికీ ఎవరికీ తెలియదు ఏం కాదులే మేం చూసుకుంటామని అన్నారు. విషయం బయట పడటంతో మాకు సంబంధం లేదని హౌసింగ్ ఏఈ రమణారెడ్డి పై నెపం వేసి అతడిని సస్పెండ్ చేయించారు. ఇప్పుడు ఏకంగా సీఐ పైనే దురుసుగా ప్రవర్తిస్తుండటంతో అధికారుల్లో వణుకు మొదలైంది.
చెయ్యని పనులకు బిల్లులు
దొర్నిపాడు మండలంలో కొందరు పంచాయతీ సెక్రటరీలు అఽధికార పార్టీ నేతలకు రూ. 2 లక్షల దాక ఇచ్చి పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. తిరిగి ఆ సొమ్ము సంపాదించుకోవడంతో పాటు ప్రస్తుతం చేస్తున్న పనుల్లో అధికార పార్టీనాయకులకు పర్సెంటేజీ ఇవ్వాల్సి ఉంటుందని ఇష్టమొచ్చినట్లు బిల్లులు రాసుకున్నారు. తర్వాత వాటిపై సంతకం పట్టాలని ఈఓపీఆర్డీ సులోచన దగ్గరకు పోగా అందుకు ఆమె ఒప్పు కోలేదు. ఈ విషయం కొందరు ‘అక్క’ దృష్టికి తీసుకు పోగా ఈఓపీఆర్డీని ఆమె తీవ్రంగా మందలించి చెప్పినట్లు బిల్లులపై సంతకం పెట్టు ..లేకుంటే సెలవుపై వెళ్లు అని హెచ్చరించినట్లు సమాచారం. ఈ తప్పుడు బిల్లులు పెడితే తన ఉద్యోగానికే ఎసరు వస్తుందని భయపడిన సదరు అధికారిణి దీర్ఘకాలిక సెలవుపై వె ళ్లారు.
చాగలమర్రిలో ఉద్యోగం చేయాలంటే హడల్
చాగలమర్రి మేజర్ గ్రామ పంచాయతీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రకాశం రెండు నెలలకే అధికారపార్టీ నాయకుల ఒత్తిడిని తట్టుకోలేక సెలవుపై వెళ్లాడు. ఆ సెలవుల్లోనే ఉన్నతాధికారులతో మాట్లాడుకుని బదిలీ చేయించుకుని వెళ్లిపోయాడు. చాగలమర్రి మండలానికి ఎంపీడీఓగా ఎన్నికల అనంతరం బదిలీపై వచ్చిన మంజులవాణి ఇక్కడ ఒక నెల బాధ్యతలు నిర్వహించింది. తర్వాత ఒత్తిడి, బెదిరింపులు ఎక్కువ కావడంతో నంద్యాల డీపీఓ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వెళ్లింది. చాగలమర్రి మండలం హౌసింగ్ ఏఈ షఫీవుల్లా కూడా దొంగ బిల్లులు, అర్హత లేనివారికి ఇళ్లు మంజూరు చేయాలని రోజు బెదిరిస్తుండటంతో సెలవుపై వెళ్లి పోయాడు. కాగా వీరి స్థానంలో ఎవరూ ఇక్కడకు వచ్చేందుకు మొగ్గు చూపకపోవడంతో ఇన్‌చార్జీలతో పాలన కొనసాగిస్తున్నారు. ఇలా నియోజకవర్గంలో పదుల సంఖలో అధికారులు బదిలీ చేయించుకుని వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారే తప్ప ఇక్కడికి వస్తామని అడిగే అఽధికారే లేడని ఉద్యోగుల్లో చర్చ కొనసాగుతోంది.
ఆళ్లగడ్డలో ఆటవిక రాజ్యం
రెచ్చిపోతున్న తెలుగు తమ్ముళ్లు
ఏ అధికారైనా జీ హుజూర్ అనాల్సిందే
చెప్పినట్లు వినలేదని మునిసిపల్
కమిషనర్‌ను సెలవుపై పంపించిన వైనం
సస్పెండైన హౌసింగ్ ఏఈ
వేధింపులు తట్టుకోలేక సెలవుపై
వెళ్లేందుకు సిద్ధమైన దొర్నిపాడు
ఈఓపీఆర్డీ
తాజాగా రూరల్ సీఐపై చర్యలు
తీసుకోవాలని పోలీస్ కార్యాలయంపై
దండెత్తిన పచ్చమూకలు
పోలీసులకే రక్షణ లేకుంటే
మా పరిస్థితేంటని బెంబేలెత్తుతున్న
ఇతర అధికారులు
Comments
Please login to add a commentAdd a comment