మల్లన్న స్పర్శదర్శనంలో మార్పులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనంలో మార్పులు చేసినట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాస రావు తెలిపారు. శనివారం ఈఓ మాట్లాడుతూ క్షేత్రాన్ని దర్శించే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న కారణంగా సర్వదర్శన క్యూలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు మార్పులు చేశామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవురోజుల్లో రెండు పర్యాయాలు (7.30ని.లకు, రాత్రి 9.00 గంటలకు) మాత్రమే స్పర్శదర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఇతర సమయమంతా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని చెప్పారు. భక్తులు స్పర్శదర్శనం టికెట్లను ఆన్‌లైన్ల ద్వారా పొందవలసి ఉంటుందని, ఒక్కో విడతలో 500 టికెట్లు మాత్రమే జారీ చేయబడుతాయన్నారు.
డ్యాంలో 109 టీఎంసీల నీరు
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో శనివారం సాయంత్రం సమయానికి 109.2730 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 861.10 అడుగులకు చేరుకుంది. శుక్రవారం నుంచి శనివారం వరకు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో 3,985 క్యూసెక్కుల నీటిని వినియోగించుకొని 2.025 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీకి 1,500 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 490 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,375 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,334 క్యూసెక్కులు, నాగార్జునసాగర్‌కు 3,985 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
సర్వేలు పూర్తి చేయాలి
మహానంది: ప్రభుత్వం అమలు చేస్తున్న సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి ఆదేశించారు. మహానందిలోని సచివాలయంలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అనంతరం మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం లోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ, హౌస్ హోల్డ్ జియో క్యాప్చర్, ఎన్‌పీసీఐ సర్వే, పీఏసీఎస్‌ల సర్వేల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ మహబూబ్ దౌలా, ఈఓఆర్డీ నాగేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment