నీలకంఠుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: ఇలకై లాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు నీలకంఠుడి దర్శనానికి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శ దర్శనం నిర్వహించుకున్నారు. కాగా భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి.
నేటి నుంచి విద్యుత్ చార్జీల పెంపుపై అభిప్రాయ సేకరణ
నంద్యాల(అర్బన్): విద్యుత్ చార్జీల పెంపుపై 7, 8 తేదీల్లో వినియోగదారులతో నంద్యాల, ఆత్మకూరు, డోన్ డివిజన్లలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ సుధాకర్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్‌లు ప్రతిపాదించిన వార్షిక ఆదాయం, అవసరాలు, విద్యుత్ చార్జీలపై హైబ్రీడ్ విధానంలో అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు. డివిజన్లలోని డీఈ కార్యాలయాల పవర్‌హౌస్ కాంపౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి వినియోగదారులు హాజరు కావాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు బహిరంగ విచారణ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.
ప్రత్యేక తరగతులు
నిర్వహించకపోతే చర్యలు
పాణ్యం: జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో క్రమం తప్పకుండా పదోతరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయులెవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ఉదయం డీఈఓ పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. స్టడీ అవర్స్ నిర్వహణకు ఉపాధ్యాయులు ప్రసాద్, ధనలక్ష్మి ఆలస్యంగా రావడంతో డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆయన తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో ప్రార్థన సమయంలో విద్యార్థులకు వివరించారు. ప్రణాళికతో చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మేరీ సునీతా, ఎంఈఓలు కోటయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
నంద్యాల: జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సవరణ చేపట్టి తుది ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ తన చాంబర్‌లో తుది ఓటర్ల జాబితా పత్రాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసి మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం అనంతరం జిల్లాలో 13,92,036 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 1629 పోలింగ్ స్టేషన్ పరిధిలో పురుష ఓటర్లు 6,81,581మంది, మహిళా ఓటర్లు 7,10,193 మంది, ఇతరులు 262 మంది ఉన్నారన్నారు. అన్ని నియోజకవర్గాల పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈఆర్వోలు తుది ఓటర్ల జాబితాను విడుదల చేసి ప్రదర్శిస్తున్నా రన్నారు. కార్యక్రమంలో బీజేపీ తరఫున నాగ శివ సాయి సందీప్, సీపీఎం తరఫున నరసింహులు, కాంగ్రెస్ తరఫున రియాజ్‌బాషా, టీడీపీ తరఫున శివరామిరెడ్డి ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ జయప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment