11 నుంచి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నికదీక్షతో ఏడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 11న ఉదయం 8.45 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. మహాగణపతిపూజ, వృద్ధి, అభ్యుదయాల కోసం స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. అనంతరం శివపరివార దేవుడైన చండీశ్వరునికి విశేషపూజలు చేస్తారు. కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, కలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానములు, పారాయణలు నిర్వహిస్తారు. సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపనలు, ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ, ముక్కోటి దేవతలను, సకల సృష్టిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ధ్వజారోహణ కార్యక్రమం చేపడతారు. ఈ నెల 12నుంచి స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, 14న మకర సంక్రాంతిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవ కల్యాణం, 16న యాగపూర్ణాహుతి, 17న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ నిర్వహిస్తారు.
ఆర్జితసేవలు నిలుపుదల
ఉత్సవాల సందర్భంగా దేవస్థానం అధికారులు ఈ నెల 11నుంచి 17వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైనా రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, గణపతిహోమం, శ్రీసుబ్రహ్మణ్యశ్వరస్వామి కల్యాణం, స్వామిఅమ్మవార్ల కల్యాణం, ప్రాతఃకాలసేవ, ప్రదోషకాలసేవ, ఏకాంతసేవలు నిలుపుదల చేశారు.
బ్రహ్మోత్సవ క్రతువులు
ఈ నెల 11న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 12న భృంగివాహనసేవ, 13న కై లాసవహనసేవ, 14న నందివాహనసేవ, 15న రావణవాహనసేవ, 16న పూర్ణాహుతి, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ, 17న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment