దోచుకోవడమే లక్ష్యంగా పాలన
● కూటమి సర్కారుపై ఎమ్మెల్సీ
ఇసాక్‌బాషా ధ్వజం
బొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా విమర్శించారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో గద్దెనెక్కిన బాబు అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించారన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా ఒక్కొక్కరికి రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించారన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు. అలాగే తల్లికి వందన, ఆడబిడ్డ నిధి, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇలా అనేక పథకాలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. విచ్చలవిడిగా మద్యం దుకాణాల ఏర్పాటే అందుకు నిదర్శనమన్నారు. ఎప్పుడూ మాట మీద నిలబడరనే పేరును బాబు మరోసారి సార్థకం చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గెలిచిన వెంటనే అక్కడి ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాయని గుర్తు చేశారు. ఇక్కడ కూటమి సర్కారు మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేసిందన్నారు. వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చిందని చెప్పారు. ప్రస్తుత సర్కారు ఆదుకోకపోగా కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వలంటీర్లను తొలగించి వారి కడుపు కొట్టిందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య కూడా దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment