డ్రాపౌట్ తగ్గించేందుకే మధ్యాహ్న భోజనం
● రాష్ట్ర న్యాయ, మైనార్టీ
సంక్షేమ శాఖ మంత్రి
ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల డ్రాపౌట్ తగ్గించేందుకే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర, న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయన్నారు. వాటన్నింటిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రస్తుతం రూ.27.39 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అలాగే బోధనా విధానాన్ని మెరుగుపర్చేందుకు జిల్లా, రీజనల్ స్థాయిలో అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ (ఏజీఎంసీ)లను ఏర్పాటు చేశామన్నారు. క్రమం తప్పకుండా పేరెంట్ – టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తున్నామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్/నీట్ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు, పుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందజేస్తామన్నారు. ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఆలోచనలతో పాటు నైపుణ్యం పెంచుకోవాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు ప్రతిరోజు పౌష్టికాహారం అందజేస్తామని చెప్పారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్కుల కోసం కాకుండా విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి సారించాలన్నారు. అప్పుడే పోటీ పరీక్షల్లో నెగ్గుకురాగలుగుతారని చెప్పారు. కాలాన్ని వృథా చేయకుండా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఐఈఓ సునీత, కళాశాల ప్రిన్సిపాల్ సోమశేఖర్, ఉర్దూ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కరిముల్లా. ఉర్దూ కాలేజ్ ఇన్‌స్పెక్టర్ అసుముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
● కోవెలకుంట్ల: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివి ఉన్నత శిఖరాలు చేరుకుని తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ఎంపీడీఓ వరప్రసాదరావు, ఈఓపీఆర్‌డీ ప్రకాష్‌నాయుడు, అధ్యాపకులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment