‘కంది’ పోయింది..!
ఎకరాకు రూ. 30 వేల పెట్టుబడి
ఎకరాకు రూ. 20 వేలు కౌలు చెల్లించి 10 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. సేద్యాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలు వెచ్చించాను. పూత, పిందె దశలో తుఫాన్ల కారణంగా వర్షాలు కురిసి పూత, పిందె రాలిపోయి నష్టం వాటిల్లి పెట్టుబడులు నేలపాలయ్యాయి.
– సుధాకర్‌రెడ్డి, రైతు, కంపమల్ల
వర్షాలతో
కంది పంటకు నష్టం
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు కంది పంట సాగుకు అనుకూలంగా మారాయి. ఎకరా విస్తీర్ణంలో కంది పంట సాగు చేశాను. పైరు వివిధ దశల్లో ఐదు పర్యాయాలు క్రిమి సంహారక మందు పిచికారీ చేయాల్సి వచ్చింది. పైరు పూత దశలో ఉండగా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలతో పూత, పిందె రాలిపోయాయి. ఎకరాకు 3–4 క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు.
– మస్తాన్, రైతు, కోవెలకుంట్ల
● జిల్లాలో 1.05 లక్షల ఎకరాల్లో
కంది సాగు
● రైతులను వెంటాడిన తుఫాన్లు
● రాలిపోయిన పూత, పిందె
● పెట్టుబడులు నేలపాలు
● దిగుబడులపై ఆవిరైన ఆశలు
కోవెలకుంట్ల: కంది రైతుల ఆశలు ఆవిరయ్యాయి. విత్తనానికి ముందు వర్షాలు, వాతావరణం అనుకూలంగా మారటంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో విస్తారంగా కంది పంట సాగైంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 90,585 ఎకరాల్లో కంది సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో లక్ష్యాన్ని మించి 1.05 లక్షల ఎకరాల్లో రైతులు కంది పంట వేశారు. ఇందులో డోన్ వ్యవసాయ సబ్ డివిజన్‌లో అత్యధికంగా 74,260 ఎకరాల్లో, నందికొట్కూరు సబ్ డివిజన్‌లో 10,735 ఎకరాల్లో, నంద్యాల డివిజన్‌లో 10,690 ఎకరాల్లో, కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లో 8,495 ఎకరాల్లో, ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌లో 2,285 ఎకరాల్లో, ఆత్మకూరు డివిజన్‌లో 782 ఎకరాల్లో కంది పంట సాగైంది.
రాలిపోయిన పూత, పిందె
180 రోజుల పంటకాలం కలిగిన కంది పంటను జిల్లాలో రైతులు విస్తారంగా సాగు చేశారు. ఈ ఏడాది దిగుబడులు ఆశించిన స్థాయిలో వస్తాయని భావించారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సేద్యాలు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల వరకు వెచ్చించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడన ప్రభావాలతో గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అధిక వర్షాలతో పూత, పిందె రాలిపోయాయి. అధిక తేమ కారణంగా మిగిలిన పైరును తెగుళ్లు ఆశించాయి. నాలుగు నెలల పాటు పైరును కంటికి రెప్పలా కాపాడుకోగా తుఫాన్లు కొంపముంచాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు రూ. 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే తుఫాన్ల ప్రభావంతో ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడులు వచ్చే పరిస్థితులు లేవని వాపోతున్నారు. ప్రభుత్వం పంట కోత ప్రయోగాలు నిర్వహించి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment