కారడవిలో విధులు. అక్కడ వన్యప్రాణులను కాపాడాలి. వేటగాళ్ల
ఇది అటవీ సంరక్షణలో కీలక పాత్ర
పోషించే ప్రొటెక్షన్ వాచర్ల దుస్థితి
● ఉద్యోగ భద్రత కరువు..
పనికి తగ్గ వేతనం దొరకదు
● జీతం ఒకరికే.. కుటుంబమంతా
అడవిలోనే
● రోగాల బారిన పడితే ఉద్యోగం
వదులు కోవాల్సిందే
● నాలుగు అటవీ డివిజన్‌లలో
91 బేస్ క్యాంపులు
● 455 మంది విధుల నిర్వహణ
ఆళ్లగడ్డ: ఉమ్మడి కర్నూలు, ప్రకాశం జిల్లాల పరిధిలో దట్టమైన నల్లమల అడవులున్నాయి. ఎంతో విలువైన ఎర్రచందనం, టేకు, వెదురు తదితర ప్రకృతి సంపదతో పాటు కోట్లాది వన్యప్రాణులు ఉన్నాయి. వాటిని రక్షించడంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ నిత్యం అడవిలో మమేకమై అక్కడే పుట్టిపెరిగిన అడవి బిడ్డలను ఇందులో భాగస్వాములుగా చేర్చడం ద్వారా చక్కని ఫలితాలు సాధించవచ్చని అటవీశాఖ భావించింది.
బేస్ క్యాంపుల
అంకురార్పణ ఇలా...
ఎర్రచందనం అధికంగా ఉన్న శేషా చలం అడవుల్లో 2004లో బేస్ క్యాంపులను నెలకొల్పారు. అక్కడ చక్కటి ఫలితాలు రావడంతో నల్లమల అభయారణ్యంలో ఈ విధానానికి అంకురార్పణ జరిగింది. ఎర్రచందనం, టేకు, జుట్టేగ దుంగల స్మగ్లర్లను అరికట్టడంలో బేస్ క్యాంపు సిబ్బంది చక్కని ప్రగతిని సాధించారు. అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా.. వన్యప్రాణులు వేట గాళ్ల ఉచ్చులో పడకుండా కాపాడటంలోను వీరి పాత్ర శ్లాఘనీయం. నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నాలుగు అటవీ డివిజన్ (జిల్లాలు) ల పరిధిలో 91 బేస్ క్యాపులు ఉన్నాయి. ఇందులో 455 మంది దాక గిరిజన యువత విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆ బేస్ క్యాంపుల్లోనే గుడిసెలు వేసుకుని రాత్రి పగలు అన్న తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.
పని ప్రమాదకరం.. ఉద్యోగం తాత్కాలికం
రేయింబవళ్లు దట్టమైన అడవిలో క్రూరమృగాల మధ్యన విధులు నిర్వహించే ప్రొటెక్షన్ వాచర్ల వేతనం రూ 17,224 గా ఉంది. అయితే, పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర కటింగ్‌లన్నీ పోను చేతికి వచ్చేది రూ. 9,002 మాత్రమే. ఈ మొత్తం వేతనం కూడా నెలనెల వస్తుందా అంటే లేదు. రెండు, మూడు నెలలకు ఒకసారి అందుతుంది. ఒక్కోసారి ఆరు మాసాలకు కూడా వేతనాలు అందని పరిస్థితి. ఉన్నతాధికారి నుంచి బీట్ అధికారి వరకు ఎవ్వరికి వీరి మీద కోపం వచ్చినా వెంటనే విధుల్లోనుంచి తొలగిస్తున్నాం ఇంటికి వెళ్లి పొమ్మంటారు. ఇలాంటి సంఘటనలు వందల కొద్ది జరిగాయి. వారానికి ఒక రోజు సెలవు ఉందని చెబుతున్నప్పటికీ దాదాపు ఎవ్వరికి ఇది వర్తించడం లేదు. ఏదైనా అత్యవసరముండి సెలవు అడిగితే ఉద్యోగం మానుకోమని చెబుతారు. అందుకే సెలవు అడగాలంటే వారు భయపడతారు. ఈ అటవీ శాఖ పరిధిలో ఫైర్ వాచర్లు, గార్బేజ్ కలెక్షన్ వాచర్లు, టైగర్ ట్రాకర్లు, డ్రైవర్లు, టానా, చెక్‌పోస్ట్ వాచర్లు, స్వచ్ఛ సేవకులు ఇలా వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ 24 గంటల ప్రాతిపదికనే అడవిలో పనిచేస్తున్నారు.
క్షణ క్షణం.. భయం భయం
నల్లమల అడవి పరిధిలోని నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉద్యోగం అంటేనే భయం భయం. అలాంటిది రాత్రి పగలు అక్కడే కారడవిలో ఉంటూ తమ పరిధిలోని చట్టూ సుమారు 10 కిలోమీటర్లు తిరుగుతూ ఉండాలి. చిన్న అలజడి వినిపించినా వెంటనే అక్కడికి చేరుకోవాలి. ఇలాంటి సమయంలో పొదల్లో నక్కి ఉన్న ఎలుగుబంట్లు, అడవి పందులు, పులులు, చిరుతలు వంటి క్రూర మృగాలు, నాగు పాములు, పొట్టపింజరు, రక్త పింజరు, మిన్నాగు వంటి విషపురుగులు, మరో వైపు అడవి దోమలు, చీకటీగలు, తేనెటీగలు ఇలా క్షణక్షణం ప్రమాదాలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి. గతంలో ఆత్మకూరు రేంజ్ పరిధిలో ఎలుగు బంటి దాడి చేయగా ముగ్గురు ప్రొటెక్షన్ వాచర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఓ బేస్ క్యాంపు పరిధిలో ఏం జరిగిందో తెలియదు. ప్రొటెక్షన్ వాచర్ అడవిలోనే మృతిచెందాడు. అనేక మంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
చచ్చెంత రోగం వచ్చినా అంతే...
బేస్ క్యాంపులు అంటేనే నల్లమల అడవి మధ్యలో ఉంటాయి. ఇక్కడి చేరుకోవాలంటే సుమారు 10 నుంచి 30 కిలో మీటర్లు కాలినడకన అతికష్టంమీద వెళ్లాల్సిందే. ప్రొటెక్షన్ వాచర్లందరు దాదాపు చెంచు కుటుంబాలకు చెందినావారే. దీంతో వీరు విధులు నిర్వహించే చోటకే భార్య, పిల్లలను, కుటుం సభ్యులను అందరిని తీసుకొని పోవడం పరిపాటి. అక్కడే అడవిలో చిన్న పూరిగుడిసె వేసుకుని ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కరెంటు ఉండదు. ఈ మధ్య సోలార్ ఏర్పాటు చేసినప్పటికీ ఆకాశంలో మబ్బులు ఏర్పడితే పనిచేయవు, మంచినీటి సౌకర్యం ఉండదు. అడవిలోని మురుగు నీరు తాగడంతో పాటు కొండ ఈదర, అడవి దోమలు కుట్టడంతో దీర్ఘకాలిక వ్యాధుల బరిన పడుతుంటారు. చచ్చేంత వ్యాధి సోకినా సెలవు ఇవ్వరాని మాజీ ప్రొటెక్షన్ వాచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment