వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ: శ్రీమద్ అహోబిలం క్షేత్ర పరిధిలో వెలసిన నవనారసింహ ఆలయాలు బుధ వారం భక్త జనసంద్రంగా మారాయి. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి వేడుకలను పురస్కరించుకుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేడుకల్లో భాగంగా దిగువ అహోబిలంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవమూర్తులైన పావన లక్ష్మీనృసింహస్వామిని, సుదర్శనమూర్తులను దేవాలయం ప్రధాన ద్వారం ఎదురుగా యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. నవకలశాలతో తిరుమంజనం నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వాతి, సుదర్శన హోమాలు వైభవోపేతంగా సాగాయి. పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధానార్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి.
బేతంచెర్ల: మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో స్వాతి వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో వేదపండితులు జ్వాలా చక్రవర్తి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మద్దిలేటి నరసింహస్వామికి సుప్రభాత సేవ, పంచామృత సహిత విశేష ద్రవ్య తిరుమంజనం, ధన్వంతరి మూల మంత్ర జపం చేశారు. తర్వాత అలంకార ప్రియుడైన స్వామి వారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు మద్దిలేటి స్వామి, అర్చకులు మనోహర్, రాఘవయ్య, మద్దిలేటిస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment