‘ఫింగర్ ప్రింట్’తో నేరస్తుల గుర్తింపు
బొమ్మలసత్రం: ఫింగర్ ప్రింట్ యూనిట్‌లను బలోపేతం చేశామని, వివిధ రకాల కేసుల్లో ఉన్న నేరస్తులను సులువుగా గుర్తించవచ్చునని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బుధవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణాతో కలసి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలతో పాటు ముఖ్యమైన కేసుల దర్యాప్తులో సాంకేతికతను ఉపయోగించాలన్నారు. నేరాల నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అసాంఘిక శక్తులను అడ్డుకునేందుకు డ్రోన్, సీసీ కెమెరాలను వినియోగించాలన్నారు. నేరాలు జరిగే ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమరుస్తున్నామని, నేరస్తులను గుర్తించటం సులువతుందని వివరించారు. రాష్ట్రంలో 18 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో ఈ సంఖ్యను లక్ష వరకు పెంచుతామన్నారు. శాంతిభద్రతలకు ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమష్టి కృషితో నేరాల నియంత్రణకు కృషి చేయాలని జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రబాబు, పట్టణ డీఎస్పీ మంద జావళి ఆల్ఫోన్, డీఎస్పీలు రవికుమార్, శ్రీనివాస్, సీఐలు సూర్యమౌళి, వెంకటేశ్వరరావు, మోహన్‌రెడ్డి, ఇస్మాయిల్, సుధాకర్‌రెడ్డి, ఈశ్వరయ్య, కంబగిరిరాముడు తదితరులు పాల్గొన్నారు.
డీజీపీ ద్వారకా తిరుమలరావు
Comments
Please login to add a commentAdd a comment