ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపిక
కోవెలకుంట్ల: జిల్లాలో రెండు పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికై నట్లు ఈఓపీఆర్‌డీ, మేజర్ గ్రామ పంచాయతీ ఇన్‌చార్జ్ ఈఓ ప్రకాష్‌నాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవెలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీ, నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామ పంచాయతీలను కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేసిందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పారిశుద్ధ్యం, ఇంటి, నీటి పన్నుల వసూళ్లు, వర్మి కంపోస్టు తయారీ, విక్రయాలు, గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూర్చే వనరుల నిర్వహణ, తదితర అన్ని రకాల అభివృద్ధి పనులను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేపట్టినట్లు వెల్లడించారు. ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు ఈనెల 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను ప్రత్యేక ఆహ్వానం అందిందన్నారు. కోవెలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మెట్ల సరళ గణతంత్ర వేడుకల పరేడ్‌కు హాజరుకానున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment