ఐదారు శతాబ్దాల పాటు సాగు, తాగునీటి అవసరాలను తీర్చిన చెర
చెరువులో సాగుచేసిన పొలానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు విడుదల చేసినట్లు చూపుతున్న బోర్డు
‘రెవెన్యూ’లో లాలూచి.. రైతు నోట్లో మట్టి
చెరువు గర్భాలను రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై కూడా ఉంది. దశాబ్దాలుగా ఆక్రమణదారులు చెరువు భూములను కబ్జా చేసేస్తున్నా.. ఫిర్యాదలు వస్తున్నా ఆయా గ్రామాల, మండల రెవెన్యూ అధికారులు ఏమి చేస్తున్నారన్నది ప్రశ్నార్థకం. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే ఎకరం భూమి కనీసం రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రెవెన్యూ అధికారులకు భారీ మొత్తంలో ముడుతుండటంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఈ చిత్రం ఎల్లావత్తుల, టి.కొట్టాల, డి.కొట్టాల గ్రామాల పరిధిలోని పెద్ద చెరువు చెరువు గట్టు. ఒకప్పుడు దారిని ఆనుకుని ఉండేది. 673, 674 సర్వే నంబర్లలో 75 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు కింద మూడు గ్రామాల్లోని 105 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆక్రమణదారులు చెరువు గర్బంలో సాగు చేసుకున్న పొలంలోకి చెరువు నీరు రాకుండా ఆ కట్టనే క్రమేపి జరిపేశారు. కట్టకు, దారికి మధ్య సుమారు 15 ఎకరాల పొలం
సాగు చేసేశారు. అందుకు
నిదర్శనం ఈ కట్ట.
ఆళ్లగడ్డ: నియోజకవర్గంలో చిన్ననీటి పారుదలశాఖ పరిధిలో 23, పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 22 చెరువులున్నాయి. వీటి కింద 36,896.12 ఎకరాల ఆయకట్టు ఉంది. రెవెన్యూ, జలవనరులు, పంచాయతీరాజ్ శాఖల లెక్కల ప్రకారం చెరువులు 9,380.95 ఎకరాలు, కుంటలు 700, వాగులు 2,300 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక నేతలు ఎక్కడికక్కడ కబ్జాలకు తెరలేపుతున్నారు. కొన్ని చోట్ల జలవనరులు అన్యాక్రాంతం అయినట్లు గుర్తించిన ఆశాఖ ఇంజినీర్లు ఆయా మండల తహసీల్దార్లకు లేఖలు రాసినప్పటికీ వారి నుంచి స్పందన ఉండటం లేదు.
సరిహద్దులు లేక సులువుగా కబ్జా
చెరువులు, కుంటలకు సరైన సరిహద్దులే లేవు. పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దులు గుర్తించాల్సి ఉన్నా ఆ ప్రక్రియలో జాప్యం కొనసాగుతోంది. మరోవైపు చెరువుల్లో నీటి మట్టం తగ్గాక రబీ (ఎండకారు) పంటలు సాగు చేసుకునేలా చాలా చోట్ల ‘ఏక్ ఫసలీ’ ఒప్పందంపై పట్టాలు పొందిన వారు ఉన్నారు. నీటి మట్టం కొనసాగిన సమయంలో ఈ పట్టాదారులు పంటల సాగును చేపట్టకూడదు. అస్సలు సేద్యాలే చేయకూడదు. అయినప్పటికీ పలు చోట్ల తూములు తెరిచి నీటిని వృథాగా దిగువకు వదులుతున్నారు. చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్), హద్దులు గుర్తించాల్సిన ఉన్నా ఆ ప్రక్రియను పట్టించుకున్న పాపాన పోవడంలేదు. కొన్ని చోట్ల ఎఫ్‌టీఎల్‌ను కూడా ఇష్టారీతిన మార్చుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయన్న ఆరోపణలున్నాయి.
చట్టం.. వారికి చుట్టం
నియోజకవర్గంలో జలవనరుల మొత్తం విస్తీర్ణం 12,380.95 ఎకరాలు ఉంటుందని రెవెన్యూ నివేదికలు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి ఇపుడు వీటి విస్తీర్ణం 5 నుంచి 6 వేల ఎకరాల్లోపే. కొందరు అధికార పార్టీకి చెందిన అక్రమార్కులు ఎక్కడి నుంచో వచ్చి కబ్జాలకు పాల్పడుతుండగా.. మరికొందరు నేతలు తమకు సమీపంలో ఉన్న చెరువులను, కుంటలు, వాగుల కట్టలను చదును చేసి కలిపేసుకుంటున్నారు. ఇంకొందరు అక్రమంగా అనుమతులు పొంది బోర్లు తవ్వించారు. విద్యుత్ అధికారులు వాటికి అనుమతులు ఇచ్చి ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఉద్యాన, ఉపాధి హామీ అధికారులు సబ్సిడీపై ఉద్యాన పంటలు నాటిస్తున్నారు. చెరువులు, కుంటల్లో బోర్లు తవ్వకం చట్ట రీత్యా విరుద్ధమైనా.. అధికారుల అలసత్వం.. అవినితీ కారణంగా చట్టం వారికి చుట్టమవుతోంది. జలవనరులశాఖ రికార్డుల్లో చెరువులు, కుంటలుగా ఉన్నవి రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పొలాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment