వ్యాధుల నుంచి లేగదూడలను కాపాడుకోండి
● పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి
గోవింద నాయక్
రుద్రవరం: వ్యాధుల నుంచి లేగదూడలను కాపాడుకోవాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి గోవింద నాయక్ పశుపోషకులకు సూచించారు. మండల పరిధిలోని ఎర్రగుడిదిన్నెలో గురువారం రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రదర్శనకు 45 లేగ దూడలు రాగా అందులో ఆరోగ్యంగా ఉన్న దూడలను గుర్తించి వాటి యజమానులకు బహుమతులు, వాటి ఎదుగుదలకు మరింత అవసరమైన మందులను అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా పశు గణన అభివృద్ధి సంస్థ ఉప సంచాలకులు డాక్టర్ రాజశేఖర్, ఆళ్లగడ్డ ఉప సంచాలకులు రమణయ్య, చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం సహాయ సంచాలకులు వరప్రసాదు, కొండా రెడ్డి, గిడ్డయ్య, వైద్యులు మనోరంజన్ ప్రతాప్, బాలాజీ నాయక్, శ్రీనివాసులు, ఎంపీడీఓ భాగ్యలక్ష్మి ఉన్నారు.
10 నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్
నంద్యాల (న్యూటౌన్): ఈనెల 10 నుంచి ఇంటర్మీడియెట్ జనరల్ ప్రాక్టికల్స్ ఉంటాయని డీఐఓ సునీత, స్పెషల్ అధికారి శంకర్‌నాయక్ తెలిపారు. ఇంటర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్లతోపాటు సైన్స్ లెక్చరర్స్‌తో గురువారం వారు సమావేశమయ్యారు. ప్రాక్టికల్ సెంటర్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జిల్లాలో జనరల్ ప్రాక్టికల్స్‌కి 64 సెంటర్లను కేటాయించామని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డీఈసీ మెంబర్లు పీవీ రామన్, కృష్ణయ్య, ప్రభాకర్, రామకృష్ణ పాల్గొన్నారు.
వెబ్‌సైట్‌లో టెక్నికల్ ఎగ్జామ్స్ టైంటేబుల్
నంద్యాల(న్యూటౌన్): టెక్నికల్ కోర్సు పరీక్షల టైంటేబుల్ వెబ్‌సైట్ ఉంచినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ డ్రాయింగ్, హ్యాండ్‌లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయల్, హయ్యర్ గ్రేడ్‌లలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఈనెల 19 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. టైంటేబుల్‌ను జిల్లా విద్యాశాఖ వైబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
తాగునీటి సమస్య రానివ్వొద్దు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీటి సమస్య రానివ్వొద్దని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా గురువారం దేవస్థాన ఈఓ రక్షిత మంచినీటి సరఫరాను, నిర్మాణంలో ఉన్న మినీ కల్యాణకట్ట, పలు పార్కింగ్ ప్రదేశాలు, గణేశ సదన్ ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్కింగ్ ప్రదేశం, సీఆర్‌ఓ ఆఫీస్ వద్ద పార్కింగ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా తాగునీటి సరఫరా ఉండాలన్నారు. నీటి కాలుష్యం వల్ల ఏర్పడే రోగాలను నివారించేందుకు నీటిని శుభ్రపరిచే విధానంలో ప్రమాణాలు పాటించాలన్నారు. వివిధ ప్రాంతాల్లోని తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు. అనంతరం గణేశ సదనం ఎదురుగా నిర్మిస్తున్న మినీ కల్యాణ కట్టను పరిశీలించారు. వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. సెంట్రల్ పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి, తాగునీటి సరఫరా, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీఆర్‌ఓ ఆఫీసు వద్ద పార్కింగ్ ప్రదేశంలో లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి, డీఈఈ చంద్రవేఖర శాస్త్రి, ఏఈ రాజేశ్వరరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment