ఉగాది నుంచి పీ–4 విధానం అమలుకు చర్యలు
నంద్యాల: వచ్చే ఉగాది నుంచి రాష్ట్రంలో పీ–4 (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్స్–పార్టనర్ షిప్) విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. గురువారం అమరావతి నుంచి పీ–4 విధానంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజకుమారి, డీఆర్‌ఓ రాము నాయక్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ–4 విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నదే పీ–4 విధానం ధ్యేయమన్నారు. పూర్తి స్థాయిలో విధి విధానాల రూపకల్పనకు ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించండంతోపాటు ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు గానూ ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి విజన్ ప్రణాళికల తయారీ కోసం నోడల్ అధికారులను నియమించాలని సీపీఓను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ సర్వేను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు సూచించారు. ఇప్పటి వరకు ఎంఎస్‌ఎంఈకి సంబంధించి లాగిన్ కాని సిబ్బందికి షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశించారు. ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్ డేటాను వెంటనే పూర్తి చేయించాలన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు భూములను గుర్తించాలని ఆర్డీఓలకు సూచించారు. సమావేశంలో సీపీఓ వేణుగోపాల్, డీఈఓ జనార్దన్ రెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డీఎల్‌డీఓ శివారెడ్డి, డీపీఓ జమీవుల్లా పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కె.విజయానంద్
Comments
Please login to add a commentAdd a comment