సేవ.. అభివృద్ధే లక్ష్యం
రూ.833.50 కోట్లతో ప్రగతి..
నియోజకవర్గంలో రూ.16.50 కోట్లతో సీసీ రోడ్లును వేయించాం. మక్తల్‌కు కోర్టు, అగ్రిమాపక కేంద్రం, ఆరు విద్యుత్ సబ్‌స్టేషన్లు (సంగంబండ, వడ్వాట్, పులిమామిడి, దేవరపల్లి, నాగల్‌కడ్మూర్, రాయికోడ్) గ్రామాలకు మంజూరయ్యాయి. వాటి పనులు త్వరలో ప్రారంభిస్తాం. మక్తల్ నుంచి నారాయణపేట రహదారి నిర్మాణానికి రూ.22 కోట్లు మంజూరు చేయించాం. ఈ పనులు వేగవంతంగా చేపడతాం. ఏడాదిలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించాం. ఎస్‌డీఎఫ్ నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆలయాలు, మసీదులు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, రిపేర్లు చేయించాం. భారీ వర్షాలతో చెరువులు, రోడ్లు దెబ్బతినగా రూ.కోటితో పునరుద్ధరణ పనులు చేయించాం. అనారోగ్యంతో బాధపడి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి పార్టీలకు అతీతంగా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.కోట్లు అందజేశాం. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి రూ.3 కోట్లు మంజూరు చేయించి ప్రత్యేకంగా బోర్లు వేయించడంతోపాటు నీటి ఎద్దడి లేకుండా చేశాం. మొత్తంగా ఏడాదిలో రూ. 833.50 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం.. చేపడుతున్నాం.
గార్లపల్లి సమస్య తీరుస్తా
గతంలో ఊట్కూర్ మండలంలోనే గార్లపల్లి గ్రామం ఉండేది. మక్తల్ మున్సిపాలిటీ అయిన సమయంలో గార్లపల్లి మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. రేషన్, విద్యార్థులకు సర్టిఫికెట్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా, పట్టా పాసుపుస్తకాలు సైతం ఊట్కూర్ మండలం వస్తుంది. త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య తీర్చి మున్సిపాలిటీలోకి వచ్చే విధంగా చూస్తాం.
● సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల ద్వారా
1.10 లక్షల ఎకరాలకు సాగునీరు
● ప్రత్యేక నిధులతో త్వరలో కాల్వల మరమ్మతు
● ఏడాదిలో రూ.833.53 కోట్లతో అభివృద్ధి పరుగులు
● విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
● ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి
● ‘సాక్షి’తో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్: పదేళ్లుగా వెనుకబాటుకు గురైన నియోజకవర్గాన్ని.. ఏడాదిలో రూ.833 కోట్లతో అభివృద్ధి పరుగులు పెట్టించాం.. 18 ఏళ్లుగా సంగం‘బండ’ సమస్య పెండింగ్‌లో ఉండగా.. ఎమ్మెల్యేగా గెలిచిన 18 రోజుల్లోనే నిర్వాసితులకు రూ.12 కోట్లు మంజూరు చేయించి.. 9 గ్రామాల్లోని 25వేల ఎకరాలకు సాగునీరు అందించాం.. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు పారించాం.. ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేయడంతోపాటు విద్య, వైద్యా రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా సోమ వారం ఆయన నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను ‘సాక్షి’తో పంచుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గ ప్రజల సంక్షేమం.. అభివృద్ధే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నానని.. ప్రజలే నా దేవుళ్లని.. నా జీవితం ప్రజాసేవకే అంకితమని వివరించారు.
18 ఏళ్ల సమస్య18 రోజుల్లోనే పరిష్కారం
సంగంబండ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన సంగంబండ నిర్వాసితులకు పరిహారం అందక రూ.12 కోట్లు 18 ఏళ్లుగా పెండింగ్ ఉంది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన 18 రోజుల్లో ఆ నిధులను తీసుకువచ్చి పరిహారం అందించాం. నా రాజకీయ జీవితంలో ఈ సమస్య ఇంత త్వరగా పరిష్కారం అవుతుందని ఊహించలేదు. జీవితంలో ఎప్పటికి గుర్తుండిపోయే విషయం ఇది. సంగంబండ రిజర్వాయర్‌లోని లెఫ్ట్ కెనాల్‌కు అడ్డుగా ఉన్న పెద్ద బండను పగల కొట్టించడంతో మాగనూర్, మక్తల్ మండలాల్లోని 9 గ్రామాలకు 25 వేల సాగునీరు అందింది. ఆ గ్రామాల రైతులు ఆనందంగా పంటలు పండించుకుంటున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నేరడ్‌గాం, భూత్పూర్ ఆర్‌అండ్‌ఆర్ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నా. ఇందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించం. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల నుంచి 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నా. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి కాల్వలు మరమ్మతు చేయిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment