నాణ్యమైన ఆహారంఅందించాలి
నారాయణపేట: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎంఏ రషీద్, మున్సిపల్ కమిషనర్ సునీత సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు తాజా కూరగాయలు, ఆహార పదార్థాలతో భోజనం అందించాలని.. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. కళాశాల నిర్వహణపై సంతృప్తిని వ్యక్తంచేశారు. వారి వెంట ఆర్‌ఎల్‌సీ ఖాజా బహుద్దీన్, జిల్లా కోఆర్డినేటర్ సలీం తదితరులు ఉన్నారు.
ప్రణాళికాబద్ధంగా చదవాలి
మద్దూరు: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితేనే మంచి ఫలితాలు వస్తాయని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి హెచ్.సుదర్శన్‌రావు అన్నారు. బుధవారం మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై విద్యార్థుల హాజరు శాతం, వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపు తదితర అంశాలపై సమీక్షించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాములు, అధ్యాపకులు పాల్గొన్నారు.
అలసందలు క్వింటా
రూ. 6,500
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం అలసందలు క్వింటా రూ. 6,500 ధర పలికింది. హంసధాన్యం గరిష్టంగా రూ. 2,823, కనిష్టంగా రూ. 1,931, సోనాధాన్యం గరిష్టంగా రూ. 2,736, కనిష్టంగా రూ. 1,900, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 11,606, కనిష్టంగా రూ. 8,539, తెల్లకందులు గరిష్టంగా రూ. 11,555, కనిష్టంగా రూ. 10,022 ధరలు వచ్చాయి.
చిన్నరాజమూర్ హుండీ రూ.4.17 లక్షలు
దేవరకద్ర: చిన్నరాజమూర్ శ్రీఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం హుండీని లెక్కించారు. దేవస్థాన కమిటీతోపాటు ఎండోమెంట్ అధికారులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీని లెక్కించగా రూ.4,17,410 వచ్చాయి. హుండీ ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు దేవస్థాన కమిటీ చైర్మన్ రాఘవేంద్రచారి తెలిపారు. త్వరలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో ముందస్తుగా హుండీని లెక్కించామన్నారు. బ్రహ్మోత్సవాల తర్వాత మరోసారి హుండీ లెక్కింపు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ప్రసాద్, అర్చకులు హన్మేషచారి, జీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్, ప్రేమ్‌కుమార్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment