తెల్లబోతున్నారు.. | - | Sakshi
Sakshi News home page

తెల్లబోతున్నారు..

Published Thu, Dec 12 2024 8:46 AM | Last Updated on Thu, Dec 12 2024 8:45 AM

తెల్ల

తెల్లబోతున్నారు..

మక్తల్‌ మండలం లింగంపల్లి పత్తి మిల్లు ఎదుట వాహనాల బారులు

తేమ 12 శాతం లోపు

ఉండాలి..

రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. మద్దతు ధర లభించాలంటే పత్తిలో తేమ 12 శాతం లోపు ఉండాలి. కొంతమంది నీళ్లు చల్లి తెస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల మద్దతు ధరకు కొనుగోలు చేయలేకపోతున్నాం.

– బాలామణి, మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి, మహబూబ్‌నగర్‌

ధరలు తగ్గిస్తున్నారు..

8 ఎకరాల్లో పత్తి సాగు చేశా. పండిన పంటను ట్రాక్టర్‌లో గుడిగండ్ల జిన్నింగ్‌ మిల్లుకు తీసుకొచ్చా. క్వింటాకు రూ.7,500 చెల్లించాల్సి ఉండగా.. రూ.7,300 మాత్రమే ఇచ్చారు. ప్రైవేటుకు వెళ్తే తూకం, ధరలో మోసం ఉంటుందని ఇక్కడికి వస్తే కేంద్రంలోనూ అదే పని చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే తేమ శాతం, చెత్త అంటూ లేనిపోని కారణాలు చెప్పి కష్టాన్ని దోచుకుంటున్నారు.

– లక్ష్మన్న,

రైతు, మదన్‌పల్లి (మక్తల్‌)

పంట విక్రయించేందుకు కష్టాలే..

నాకు 8ఎకరాల పొ లం ఉండగా పత్తి సాగు చేశా. పెట్టుబడి రూ.3లక్షల వర కు అయింది. సుమారు 60 క్వింటాళ్ల దిగుబడి రాగా.. అమ్మేందుకు సీసీఐ కొను గోలు కేంద్రం ఎదుట రెండ్రోజులు పడిగాపులు పడాల్సి వచ్చింది. కేంద్రం వద్ద పత్తి వాహనాలు సుమారు కిలోమీటర్‌ మేర బారులు తీరి ఉన్నాయి. పంట పండించేందుకు, విక్రయించేందుకు కష్టాలు తప్పడం లేదు. రైతు లను పట్టించుకునే వారు కరువయ్యారు.

– సతీష్‌కుమార్‌, ఎడవెళ్లి (ఊట్కూర్‌)

30 కి.మీ. నుంచి వచ్చాం..

జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం అలంపూర్‌ నియోజకవర్గం ఉండవెల్లి మండలంలోనే ఉంది. 30 క్వింటాళ్ల పత్తి పండగా బొలెరో వాహనంలో రూ.4,500 అద్దె, పత్తి ఎత్తడానికి కూలీలకు రూ.3 వేలు చెల్లించి తరలించాల్సి వచ్చింది. కాని ఇక్కడ కేవలం క్వింటాకు రూ.7,400 మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.

– వెంకట్రాముడు, రైతు, ఎల్కూరు (మల్దకల్‌)

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: గతేడాది పత్తికి ప్రభుత్వ మద్దతు ధరకు మించి ధర పలకడంతో ఈ ఖరీఫ్‌లో రైతులు ఆ పంట వైపే మొగ్గు చూపారు. కానీ వారి ఆశలు అడియాసలుగా మారాయి. వరుస వర్షాలు, తెగుళ్లతో దిగుబడి గణనీయంగా తగ్గింది. పెట్టుబడి అయినా వస్తుందని భావించిన రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చి కూలీల కొరతను సైతం అధిగమించారు. చివరకు పత్తిని విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కేంద్రాలకు వచ్చిన వారిని తేమ, వ్యర్థాల పేరిట కొర్రీలు వెక్కిరిస్తున్నాయి. కొనుగోలు చేయకుండా అధికారులు చేతులెత్తేయగా.. దీన్ని సాకుగా చేసుకుని దళారులు తక్కువ ధరతో కొనుగోలు చేస్తుండడంతో రైతులు తెల్లబోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలో పత్తి రైతుల దీనావస్థపై ‘సాక్షి’ ఫోకస్‌..

వ్యాపారులకుఅధికారుల పరోక్ష మద్దతు..

సీసీఐ యంత్రాంగం కొనుగోళ్లలో కావాలనే జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. తేమ శాతం, వ్యర్థాలు అంటూ యంత్రాల ద్వారా నాణ్యతను పరీక్షించేందుకు అధికారులు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. చివరకు తేమ శాతం ఎక్కువ ఉంది.. పత్తి నల్లగా ఉంది వంటి కొర్రీలతో కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీన్ని సాకుగా చేసుకుని జిన్నింగ్‌ మిల్లుల వ్యాపారులు, దళారులు రైతుల నుంచి తక్కువ ధరతో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521–రూ.7,220.16 (తేమ 8–12 శాతం) ఉండగా, వ్యాపారులు క్వింటాల్‌కు రూ.5,600 నుంచి రూ. 6,400 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇలా సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా దళారులే పత్తిని కొనుగోలు చేశారు. కొనుగోళ్లలో జాప్యం, కొర్రీల నేపథ్యంలో సీసీఐ యంత్రాంగంపై విమర్శలువెల్లువెత్తుతున్నాయి. సీసీఐ యంత్రాంగమే పరోక్షంగా వ్యాపారులకు సహకరిస్తోందని.. వారికి వ్యాపారులు కమీషన్‌ ఇస్తున్నారని.. వారి వ్యవహార శైలినే ఇందుకు నిదర్శనమని రైతులు ఆరోపిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మూడు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 3,064 మంది రైతుల నుంచి 74,944 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఇందులో మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం ఓబ్లాయిపల్లి గ్రామ శివారులోని శ్రీ బాలాజీ ఇండస్ట్రియల్‌ కాటన్‌ మిల్లులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 1,312 మంది రైతుల నుంచి 32,819 క్వింటాళ్ల పత్తి సేకరించారు. బాదేపల్లిలోని పద్మనాభ కాటన్‌ మిల్లులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 1,233 మంది రైతుల నుంచి 31,343 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మహేష్‌ కాటన్‌ మిల్లులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 519 మంది రైతుల నుంచి 10,783 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 3 లక్షల క్వింటాళ్ల మేర దళారులు తక్కువ ధరతో కొనుగోలు చేసినట్లు రైతు సంఘాల అంచనా.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 18 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్ల లక్ష్యం 16 లక్షల క్వింటాళ్లు కాగా.. ఇప్పటివరకు 9 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. దళారులు ఇప్పటివరకు 4 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అంచనా. దళారులు ప్రభుత్వ మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.1,300 తక్కువగా కొనుగోలు చేసినట్లు రైతులు చెబుతున్నారు.

నారాయణపేట జిల్లాలో ఆరు సీసీఐ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 2,01,136 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. మరో నాలుగు లక్షల క్వింటాళ్లు దళారులు కొన్నట్లు అంచనా. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక సీసీఐ సెంటర్‌ ద్వారా ఇప్పటివరకు 36,400 క్వింటాళ్లు కొన్నారు. మరో నాలుగు లక్షల క్వింటాళ్ల వరకు వ్యాపారులు కొన్నట్లు రైతుల ద్వారా తెలిసింది. వనపర్తి జిల్లాకు సంబంధించి ఒక సీసీఐ సెంటర్‌ ద్వారా ఇప్పటివరకు 1,473 మంది రైతుల నుంచి 36,478 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. రైతుల నుంచి మరో 40 వేల క్వింటాళ్ల పత్తిని దళారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

పత్తి రైతులకు శాపంగా మారిన తేమ కొర్రీలు

కొనుగోలు చేయకుండా

తిరస్కరిస్తున్న సీసీఐ అధికారులు

జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులకు పరోక్ష సహకారం

తక్కువ ధర చెల్లిస్తూ

దండుకుంటున్న వ్యాపారులు

లబోదిబోమని మొత్తుకుంటున్న రైతులు

No comments yet. Be the first to comment!
Add a comment
తెల్లబోతున్నారు..1
1/6

తెల్లబోతున్నారు..

తెల్లబోతున్నారు..2
2/6

తెల్లబోతున్నారు..

తెల్లబోతున్నారు..3
3/6

తెల్లబోతున్నారు..

తెల్లబోతున్నారు..4
4/6

తెల్లబోతున్నారు..

తెల్లబోతున్నారు..5
5/6

తెల్లబోతున్నారు..

తెల్లబోతున్నారు..6
6/6

తెల్లబోతున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement