పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వేను పక్కాగా నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ బేన్‌షాలం అన్నారు. బుధవారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల సర్వే, గ్రూప్–2 పరీక్షల నిర్వహణ, నూతన డైట్ మెనూ పెంపు ప్రారంభం, సంక్షేమ హాస్టళ్ల తనిఖీ తదితర అంశాలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సర్వేలో పూర్తిస్థాయిలో సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 500 దరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను నియమించినట్లు వివరించారు. 20 రోజుల్లోగా సర్వేను పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో గ్రూప్–2 పరీక్షల నిర్వహణకు కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్ల తరలింపునకు పోలీసు బందోబస్తు, ఎస్కార్ట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. వీసీలో ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, ఎస్పీ యోగేష్ గౌతమ్, ఏఎస్పీ మహమ్మద్ రియాజ్, డీఎస్పీ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment