ఎదురుచూపులు
మరికల్: తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించేందుకు రాయితీపై ప్రభుత్వం రైతులకు అందజేసే తుంపర సేద్యం పరికరాలు రైతుల చెంతకు చేరడం లేదు. యాసంగి సాగులో జిల్లాలో పలు మండల్లాలో అధిక శాతం రైతులు వేరుశనగ పంటను సాగు చేస్తారు. తక్కువ నీటి వనరులు ఉన్న రైతులు జిల్లాలో 2వేల మంది సబ్సిడీపై అందించే తుంపర పరికరాలకు దరఖాస్తులు చేసుకున్నారు. రాయితీపై కేవలం 120 మంది రైతులకు మాత్రమే రావడంతో మిగిత రైతులు వాటికోసం ఎదురుచూస్తున్నారు. మరికొంత మంది రైతులు ప్రైవేట్‌లో కొనుగోలు చేసి పంటలను తడుపుతున్నారు. మరో నెల రోజులు అయితే పంట చేతికి వస్తుంది. ఇంతవరకు రాయితీ పరికరాలు రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరా నీటితో మూడు ఎకరాలు సాగు
జిల్లాలో పలు మండలాల్లో ఏటవాలు భూములున్నాయి. ప్రధానంగా బోర్లతో యాసంగిలో వేరుశనగ సాగు చేస్తారు. నీటి కొరతను దృిష్టిలో ఉంచుకుని తుంపర పరికరాల ద్వారా నీటితడులు ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల ఎకరాకు సరిపడా నీటితో మూడు ఎకరాలకు అందించవచ్చు. ఏటవాలు భూములు ఎత్తు భూములు వర్షంతో కోతకు గురికాకుండా నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధ్యమవుతుంది. జిల్లాలో ఈ ఏడాది యాసంగిలో రైతులు 8,100 ఎకరాల్లో సాగు చేశారు. నాలుగు నెలలకు పంటచేతికి వస్తుంది. మార్కెట్‌లో మంచి ధర పలుకుతుండటంతో పాటు ఎకరాకు దాదాపు 10 నుంచి 12 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. ప్రధానంగా దామరగిద్ద, మద్దూరు, మక్తల్, కోస్గి, నారాయణపేట, మరికల్, నర్వ మండలాల్లోనే అధికంగా వేరుశనగ సాగు చేస్తారు.
120 మందిరైతులకు మాత్రమే..
జిల్లాలో రాయితీ తుంపర పరికరాల కోసం 2వేల మంది రైతులు మీసేవ కేంద్రాల్లో ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకంతో దరఖాస్తు చేసుకున్నారు. రైతు వాటా 25 శాతం డీడీ రూపంలో చెల్లిస్తే ప్రభుత్వం 75 శాతం రాయితీ ఇస్తుంది. రైతులు ఇచ్చిన డీడీలను కంపెనీకి పంపించి రైతులకు తుంపర యూనిట్లు అందజేస్తారు. ఒక యూనిట్‌లో 25 పైపులతో పాటు అవసరమైన ఇతర పరికరాలు ఉంటాయి. డీడీలు చెల్లించిన 2వేల మంది రైతుల్లో 120 మందికి మాత్రమే రాయితీ పరికరాలు అందాయి. మిగతా 1880 మందికి ఎదరుచూపులు తప్పడం లేదు.
ప్రైవేట్‌లో కొనుగోలు చేశా
8 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశా. మొదట రాయితీ తుంపర సేద్యం పరికరాల కోసం అధికారులను సంప్రదించాను. డీడీ చెల్లించాక ఎప్పుడు వస్తాయో తెలియదు. పరికరాలు వచ్చినప్పుడు అందజేస్తామన్నారు. దీంతో రూ.30 వేలు పెట్టి మహబూబ్‌గన్‌లో ప్రైవేట్ దుకాణంలో కొనుగోలు చేసి పంటకు నీరు అందిస్తున్నా.
– బోయ శ్రీనివాసులు, రైతు, మరికల్
దశల వారీగా పంపిణీ చేస్తాం
జిల్లా వ్యాప్తంగా 2వేల మంది రైతులు తుంపర సేద్యం పరికరాలకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 120 మందికి రాయితీపై పరికరాలు వచ్చాయి. త్వరలోనే ఎమ్మెల్యే చేతుల మీదుగా వీటిని అందజేస్తాం. మిగితా వారికి కూడా దశల వారీగా పంపిణీ చేస్తాం.
– వెంకటరమణ, జిల్లా ఉధ్యానశాఖ అధికారి
తుంపర సేద్యం పరికరాలు
అందక రైతుల ఇబ్బందులు
75 శాతం రాయితీపై ప్రభుత్వంకొన్నేళ్లుగా అందజేత
జిల్లాలో 2వేల మంది దరఖాస్తు
120 మందికి మాత్రమే
యూనిట్లు మంజూరు
ప్రైవేట్‌లో కొనుగోలు చేయలేక అవస్థలు
Comments
Please login to add a commentAdd a comment