ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీర్చరూ..
నారాయణపేట: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లో సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కలిశారు. నియోజకవర్గంలోని సమస్యలు, వైద్య రంగంలో కావాల్సిన మౌలిక సదుపాయాలను విన్నవించారు. జిల్లా ఆస్పత్రి, చిన్న పిల్లల ఆస్పత్రి, ప్రసూతి ఆస్పత్రిలతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది కొరతను తీర్చాలని మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానూకూలంగా స్పందించారు.
ఆర్‌ఎంను కలిసినడిపో కార్మికులు
నారాయణపేట రూరల్: ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజనల్ మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంతోష్ కుమార్‌ను సోమవారం టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి నేతృత్వంలో నారాయణపేట డిపో కార్మికులు కలిశారు. ఆయన ఛాంబర్‌లో శాలువాతో సన్మానించి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిపో సమస్యలను, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. కార్యక్రమంలో మధు, పీవీఆర్ రెడ్డి, మోహన్ రెడ్డి, శేఖర్, నారాయణ, ప్రవీణ్, నర్సిరెడ్డి, నర్సింలు, రాములు పాల్గొన్నారు.
అలసందలు క్వింటా రూ.7,011
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం అలసందలు క్వింటా గరిష్టం, కనిష్టంగా రూ.7,011 ధర పలికింది. అలాగే, వడ్లు (హంస) గరిష్టం రూ.2,813, కనిష్టం రూ.1,261, వడ్లు (సోన) గరిష్టం రూ.2,756, కనిష్టం రూ.1,500, ఎర్ర కందులు గరిష్టం రూ.11,435, కనిష్టం రూ.7,929, కందులు తెల్లవి గరిష్టం రూ.11,459, కనిష్టం రూ.8,809 ధర పలికింది.
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
గద్వాల (మల్దకల్): ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో భద్రాద్రి సీతారామలక్ష్మణ, మద్వాచారి భీమసేన విగ్రహాలను సోమవారం మంత్రాలయ పూర్వపు పీఠాధిపతి సువిదేంద్ర తీర్థులచే విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించారు. అంతకుముందు కల్యాణమండపంలో మహాహోమం, కుంభాభిషేకం, కలశప్రతిష్టలతో పాటు పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ చేపట్టారు. అనంతరం భద్రాద్రి సీతరామలక్ష్మణ, మద్వాచారిభీమసేన విగ్రహ ప్రతిష్టలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సువిదేంద్ర తీర్థులు భక్తులకు వేదప్రవచనాలు, ఆశీర్వచనాలు అందజేశారు. భక్తులు దైవమార్గంలో నడుచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, విగ్రహ దాతలు పద్మారెడ్డి, బిచ్చారెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నరేందర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
నేడు ధ్వజారోహణం
ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయ ఆవరణలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు తెలిపారు. ధ్వజారోహణంతో దేవతామూర్తులకు ఆహ్వానం పలుకుతూ ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment