మాజీ సర్పంచ్‌ల అరెస్టు
నారాయణపేట రూరల్: పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరుతూ సోమవారం నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని తాజా మాజీ సర్పంచ్ లను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన పలువురు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సమయంలో మధ్యలో అడ్డుకొని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు అప్పులు తెచ్చి మరి పనులు చేయిస్తే అవార్డులను పొందిన ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదని విమర్శించారు. పల్లెల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం, మన ఊరు మనబడి, శ్మశాన వాటిక లాంటి పనుల కోసం అప్పులు తెచ్చి మరి పూర్తి చేస్తే రూ.లక్షలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా బిల్లులను ఆపేసిందని, ప్రతిపక్షంలోని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సర్పంచులు అప్పులకు వడ్డీలు కట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలను చూసి కూడా స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు జయలక్ష్మి, శ్రీనివాసులు, సీతమ్మ వెంకట్ నాయక్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment