పత్తి కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
మాగనూర్: సీసీఐ కేంద్రంలో మూడు, నాలుగు రోజుల నుంచి పత్తి కొనుగోలు చేయకుండా అధికారులు, మిల్లు యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకోకు దిగారు. మండలంలోని వడ్వాట్ గేట్ సమీపంలో ఇటీవల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే, మంగళవారం సదరు మిల్లు యాజమానులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నాలుగు రోజులైన పత్తి కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్‌హెచ్–167 పై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో అక్కడికి చేరకున్న మాగనూర్ ఎస్‌ఐ అశోక్‌బాబు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఎమ్మెల్యే వచ్చి అధికారులతో మాట్లాడి పత్తి కొనుగోలు చేయించే వరకు రాస్తారోకో విరమించేది లేదని తేల్చి చెప్పడంతో చివరికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు.. పత్తి కొనుగోళ్లు వేగవంతం చేయడం లేదని, రెండు మూడు రోజులు పత్తి లోడుతో ఉన్న అద్దె ట్రాక్టర్లతో ఆర్థిక భారం పడుతోందని, కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కరువయ్యాయని మొర పెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి రాస్తారోకో విరమింపజేశారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుకుంటూ మిల్లు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ గ్రేడర్ అధికారి శివాజీతో మాట్లాడిన ఆయన సమస్యను అడిగి తెలుసుకున్నారు. మిషనరీలో సమస్య వలన ఆలస్యం జరిగిందని తెలపగా.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, సకాలంలో పత్తిని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. మరోసారి ఇబ్బందులు కలగజేస్తే చర్యలు తప్పవన్నారు. ఎట్టకేలకు అధికారులు పత్తి కొనుగోలును తిరిగి ప్రారంభించారు.
జాతీయ రహదారిపై ఎక్కడికక్కడే నిలిచిన వాహనాలు
Comments
Please login to add a commentAdd a comment