కృష్ణమ్మ తగ్గుముఖం
కొల్లాపూర్: కృష్ణానదిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నెలరోజుల కనిష్టానికి నీటిమట్టం చేరుకుంది. జనవరి నెలాఖరులో ఉండే లెవల్‌కు డిసెంబర్‌లోనే శ్రీశైలం బ్యాక్‌వాటర్ తగ్గిపోయింది. రాయలసీమలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులకు విరివిగా నీటిని తరలిస్తుండటంతో పాటు, శ్రీశైలం డ్యాం వద్ద విద్యుదుత్పత్తి, కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కృష్ణానదిలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది.
ఈ ఏడాది 23 టీఎంసీలు
కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు కేఆర్‌ఎంబీ అనుమతులు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 23 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ప్రాజెక్టులోని మూడు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు సాగుతున్నాయి. రోజూ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో 17 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు వెసులుబాటు ఉన్నప్పటికీ చాలినన్ని రిజర్వాయర్లు లేకపోవడంతో నీటి ఎత్తిపోతలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
రిజర్వాయర్ల కొరత..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన కేఎల్‌ఐ ప్రాజెక్టు కింద నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం కేవలం 4 టీఎంసీలు మాత్రమే. రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో నియోజకవర్గాల్లోని చెరువులకు కూడా కృష్ణానది నీటిని కాల్వల ద్వారా మళ్లిస్తున్నారు. అయితే పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులను వినియోగించుకోవాలన్నా.. వేసవిలో నీటి కష్టాలు రాకుండా ఉండాలన్నా అదనపు రిజర్వాయర్ల నిర్మాణమే పరిష్కారమని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్
వేగంగా ‘వెనక్కి’..
ఆగస్టు నెలలో వరదలు
శ్రీశైలం బ్యాక్ వాటర్ ఫుల్‌గేజ్ 885 అడుగులు. ఆగస్టు నెలలో కృష్ణానదికి వరదలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ నెలాఖరు నాటికి శ్రీశైలం డ్యాం నిండింది. వరదల సమయం నుంచి కేఎల్‌ఐ ప్రాజెక్టులో ఎత్తిపోతలు చేపట్టారు. సాగునీటి అవసరాలతోపాటు మిషన్ భగీరథ స్కీం నిర్వహణ కోసం రోజూ 0.2 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 863 అడుగుల ఎత్తులో బ్యాక్‌వాటర్ ఉంది. 825 అడుగుల వరకు కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకోవచ్చు. అయితే గతంలో కంటే ఈసారి వేగంగా బ్యాక్‌వాటర్ నీటిమట్టం తగ్గుతోంది. ఏపీలోని పోతిరెడ్డిపాడు, హంద్రినీవా, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ స్థాయిలో నీటిని ఎత్తిపోయడమే ఇందుకు ప్రధాన కారణం.
ఉన్నతాధికారులకు సమాచారం
కేఎల్‌ఐ ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుగా ఉన్నాయి. ఎల్లూరు రిజర్వాయర్ ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీళ్లు అందిస్తున్నాం. రిజర్వాయర్‌లో నీళ్లు తగ్గిన వెంటనే మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 23 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. ప్రస్తుతం ఎల్లూరు లిఫ్టులో మూడు మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా రెండింటికి మరమ్మతు చేపట్టాల్సి ఉంది. బ్యాక్‌వాటర్ నీటి నిల్వలపై రెగ్యులర్‌గా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేస్తున్నాం.
– లోకిలాల్‌నాయక్, మిషన్ భగీరథ డీఈఈ
రోజురోజుకు తగ్గిపోతున్న బ్యాక్ వాటర్
నెలరోజుల కనిష్ట స్థాయికి శ్రీశైలం డ్యాం నిల్వలు
ప్రస్తుతం 863 అడుగుల ఎత్తులో నీటిమట్టం
సాగునీటితోపాటు, మిషన్‌భగీరథ పథకానికి వినియోగం
నీటినిల్వకు అదనపు రిజర్వాయర్ల నిర్మాణమే పరిష్కార మార్గం
Comments
Please login to add a commentAdd a comment