వైభవంగా ప్రతిష్ఠాపనోత్సవాలు
నారాయణపేట రూరల్: పట్టణంలోని పరిమళాపురం రాఘవేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 109వ ప్రతిష్ఠాపనోత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఆలయంలో ఉదయం స్వామివారికి నిర్మాల్యం, పంచామృత అభిషేకం, అర్చన, నైవేద్యం, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం వైభవపీతంగా స్వామివారి మహారథోత్సవం, సాయంత్రం భక్తిశ్రద్ధలతో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు నరసింహ చారి, శక్తిపీఠం వ్యవస్థాపకులు శాంతానంద్ పురోహిత్, సేవా సమితి సభ్యులు లక్ష్మీకాంతరావు, శ్రీనివాసరావు, నరసింహ, శ్రీపాధ్, సీతారామారావు, శ్రీధర్ రావు, శేషు, ధరణిధర్, ధీరజ్, విద్యాధర్, ప్రకాష్, మంజునాథ్, రాజేంద్ర ప్రసాద్, ప్రహల్లాద్ పాల్గొన్నారు.
అమిత్‌షా వ్యాఖ్యలపై నిరసన
నారాయణపేట టౌన్: భారత రాజాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేయడంపై వామపక్షనాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతుసంఘం, ఎస్‌ఎఫ్‌ఐ తదితర సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి ఉన్నతమైన, అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు ప్రతిపక్షాలు ఉచ్చరిస్తే కేంద్రహోంమంత్రి అమిత్ షా సహించలేకపోతున్నారని అన్నారు. అంబేద్కర్ పేరు విని సహనం కోల్పోతున్నారని, అందుకే అంబేడ్కర్ పేరుకు బదులు దేవుడి పేరు జపిస్తే బావుంటుందని అంటున్నారని అన్నారు. కార్యక్రమంలో బాల్‌రామ్, వెంకట్‌రామ్ రెడ్డి,బాలప్ప,గోపాల్,అంజిలయ్య,పవన్ పాల్గొన్నారు.
హామీ అమలు చేసే వరకు పోరాటం
నారాయణపేట రూరల్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12వేల జీవన భృతి ఇస్తామని హామీ ఇచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న వారిని పట్టించుకోవడం లేదని టీయూసీఐ జిల్లా కార్యదర్శి నర్సింహ, సిపిఐ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ అన్నారు. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనకు చలో హైదరాబాద్ వెళ్తున్న ఆటో వర్కర్లను స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించగా.. వారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన తర్వాత బస్సులోనే ప్రయాణం చేస్తున్నారని, దీంతో ఆటో కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారని వాపోయారు. రోజువారీగా ఫైనాన్స్‌లు కట్టలేక జీవితాలు వెళ్లదీయడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ లను ఆటో కార్మికులకు వర్తింప చేలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు సాదిక్, నారాయణరెడ్డి, కథలప్ప, జమీరుద్దీన్, సాబీర్, నయీమ్, నారాయణ, ఎల్లప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment