అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించాలి
నారాయణపేట: అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆస్పీరేషన్ (ఆకాంక్షాత్మక) నర్వ బ్లాక్ పై జిల్లా అధికారులు, నర్వ మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. శాఖల వారీగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు.
నర్వ మండలంలో కేంద్ర మంత్రి పర్యటన
ఈనెల 26న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నర్వ మండలంలోని రాయికోడ్, పాతర్ చేడ్‌లో పర్యటించనున్నారని కలెక్టర్ తెలిపారు. ఆస్పీరేషన్ నర్వ బ్లాక్‌లో 12 ప్రభుత్వ శాఖల అధికారులు 40 ఇండికేటర్ల వారీగా సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. కేంద్ర నిధుల వినియోగంపై మంత్రి బండి సంజయ్ ఆరా తీసే అవకాశం ఉందని, కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు ఎన్ని.. ఎక్కడ పనులు నిలిచిపోయాయని ప్రశ్నించే ఆస్కారం ఉందని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇదివరకు ములుగు, భూపాలపల్లి జిల్లాలో పర్యటించారని, అక్కడి అధికారులతో మాట్లాడితే కొంత క్లారిటీ వస్తుందని సూచించారు. ఈ పర్యటన ముగిసే వరకు అధికారులెవ్వరికి సెలవులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం రాయికోడ్ పల్లె దవాఖానను పరిశీలించిన సమయంలో రికార్డులన్నీ సక్రమంగా రాయలేదని దానికి బాధ్యులు ఎవరని కలెక్టర్ వైద్యశాఖ అధికారులను నిలదీశారు.
పనిచేయడం ఇష్టం లేకపోతే బదిలీ చేసుకోండి
కలెక్టరే అన్ని చోట్లకు వెళ్లి తనిఖీలు, పరిశీలనలు జరిపితే ఇక జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు ఎందుకు ఉన్నట్లు అని కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ.. పనిచేయడం ఇష్టం లేకపోతే బదిలీ చేసుకొని వెళ్లిపోవాలని సున్నితంగా హెచ్చరించారు. విద్యాశాఖ పనితీరు సంతృప్తికరంగా లేదని, సమీక్షకు డీఈఓ ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించారు. డీఈఓ సెలవుపై వెళ్లారని విద్యాశాఖ ఉద్యోగి ఒకరు తెలపడంతో సెలవు పత్రం ఎవరికి ఇచ్చారని, తాను సెలవు ఇవ్వనిదే ఎలా వెళ్తారని ప్రశ్నించారు. నర్వ ఎంఈఓ రాయికోడ్‌కు రాలేదని, నేటి సమీక్షకు హాజరు కాకపోవడంపై సంజాయిషీ కోరారు. డిసెంబర్ వచ్చినా ఇంకా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ ఎందుకు పూర్తి కాలేదని, విద్యాశాఖ, డీఆర్డిఏ అధికారులు సమన్వయం చేసుకుని పంపిణీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నర్వ మండలంలోని పంచాయతీల వారీగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికను తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే ఉపాధి హామీ పథకం బిల్లుల పెండింగ్ , పీఎం కిసాన్ యోజన, మట్టి నమూనాల సేకరణ వివరాలను పద శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో ట్రైనీ కలెక్టర్ గరిమానరుల, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, డీఆర్‌డీఓ మొగులప్ప, డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నిధులు, అభివృద్ధి పనులపై నివేదికలతో సిద్ధంగా ఉండాలి
26న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ రాక
ఆస్పీరేషన్ నర్వ బ్లాక్‌పై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment