సమ్మెలో గురువులు.. సాగని చదువులు
మరికల్: సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో కేజీబీవీ పాఠశాలల్లో చదువులు సాగడంలేదు. దీనికితోడు శనివారం జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థినుల తల్లిదండ్రుల సమావేశం ఉండగా, ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ఈ సమావేశాలు రద్దు చేశారు. 15 రోజుల నుంచి కేజీబీవీలో పాఠాలు చేప్పే వారు లేక ఏం చదవాలో అర్థం కావడం లేదంటూ విద్యార్థినులు వారి తల్లిదండ్రుల ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల సమయం సమీపిస్తున్న వేళ సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకు దిగ్గడంతో కేజీబీవీల్లోని విద్యార్థినుల చదువులు అయోమయంలో పడ్డాయి. అంతేకాకుండా బాలికలకు రక్షణ, అల్పాహారం భోజనం అందించడానికి ఇద్దరు మినహా మిగతావరంతా సమ్మెలో ఉండడం గమనార్హం. జిల్లాలో మొత్తం 450 మంది ఉద్యోగులు నారాయణపేటలో శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరసనలు చేస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వారంతా వాపోతున్నారు. నిరవదిక సమ్మె ఇప్పటికే 15 రోజులు దాటింది.
విద్యార్థినుల భవిష్యత్‌పై ప్రభావం
ఫిబ్రవరి మూడో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలవుతాయి. పెండింగ్ సిలబస్ పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఇదే కీలక సమయం. కానీ, చదువు చెప్పే వారే సమ్మెలో ఉండడంతో విద్యార్థుల భవిష్యత్‌పై సమ్మె ప్రభావం పడబోతోంది. ఇక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులకు చెప్పాలనుకున్నా మండల వనరుల కేంద్రాలు సైతం మూత పడటంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యామ్నాయం మాటేమిటి..?
సమ్మె నేపథ్యంలో ఎంఈఓలు కేజీబీవీలను సందర్శిస్తున్నారు. బాగా చదువుకోవాలని వార్షిక పరీక్షల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని హితబోద చేస్తున్నారు. ప్రత్యామ్నాయం గురించి మాత్రం ఆలోచించడం లేదు. కేజీబీవీలకు దగ్గరలోని పాఠశాలల ఉపాధ్యాయులను బోధనకు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో విద్యార్థినులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
కేజీబీవీల్లో నిలిచిన విద్యా బోధన
ముంచుకొస్తున్న పదో తరగతి,
ఇంటర్ వార్షిక పరీక్షలు..
ఇంకా పూర్తికాని సిలబస్
ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment