యథేచ్ఛగా కల్తీ
● ఇటీవల రెండు హోటళ్లపై జరిపినదాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..
● విచ్చలవిడిగా ప్రమాదకరమైన రసాయనాలు, రంగుల వాడకం
● రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసంసరఫరా
● మెస్‌లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యతా ప్రమాణాలు గాలికి..
● నామమాత్రపు తనిఖీలతో అడ్డుకట్ట పడని వైనం
పాలమూరు: ఉరుకులు, పరుగుల జీవితంలో చాలామంది బయటి ఆహారం తింటుంటారు. ఇక వారాంతాల్లో కుటుంబంతో కలిసి సరదాగా హోటళ్లకు వెళ్లి భోజనం చేసేవారు ఎక్కువే.. ఈ క్రమంలో ఒక కుటుంబంతో హోటల్‌కు వెళ్తే.. మాములుగా రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వెచ్చించాల్సిందే. ఇందుకు తగ్గట్టుగానే హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లు, టిఫిన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో పోటీని తట్టుకుంటూ తమ వైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొందరు నిర్వాహకులు కల్తీ బాట పడుతున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు, ఇతర రంగులు కలుపుతూ.. ప్రజల జేబులు గుళ్ల చేయడమే కాకుండా.. వారి ఆర్యోగాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ప్రజల ఆరోగ్యంపై కల్తీ ఆహారం ప్రభావం అధికంగా ఉంటోంది. వినియోగదారులు మోసపోవడంతోపాటు అనారోగ్యం బారిన పడుతున్నారు. వీటిపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన చర్యలు సక్రమంగా లేకపోవడంతో యథేచ్ఛగా కల్తీ వాడకం పెరిగిపోతోంది. మహబూబ్‌నగర్‌లోని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆహార పదార్థాలను తయారు చేసి.. విక్రయించే క్రమంలో అధిక మోతాదులో రంగులు వినియోగించడం, మోతాదుకు మించి ప్రిజర్వేటివ్స్, ప్రమాదకరమైన అజినోమోటో లాంటి టెస్టింగ్ సాల్ట్ కలిపి ప్రాణాంతకమైన ఆహారం అందిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. కిచెన్స్ అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు అపరిశుభ్రమైన పరిసరాల్లో ఆహారం వండుతున్నట్లు గుర్తించారు. రంగులు వాడటం, గడువు ముగిసిన పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా దాదాపు 200 రకాల వ్యాధులు వస్తున్నట్లు ఇటీవల కొన్ని సర్వేల ద్వారా తేలింది.
● మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది 70 శాంపిల్స్ సేకరించగా.. నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్న వాటిలో 21 గుర్తించి రూ.85 వేల జరిమానా విధించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 5 కేసులు నమోదు చేశారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లాలో 75 శాంపిల్స్ సేకరించగా 11 నాణ్యతా ప్రమాణాలకు తక్కువగా ఉన్నట్లు గుర్తించి.. రూ.95 వేల జరిమానా విధించారు. అపరిశుభ్రంగా ఉన్న నాలుగు హోటళ్లపై కేసులు నమోదు చేశారు.
నిబంధనలు పాటించక..
అధికారుల నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. ఆహార కల్తీల నియంత్రణపై అలసత్వం ప్రజలను రోగాల బారిన పడేస్తోంది. తినుబండారాలు, ఆహార పదార్థాల అమ్మకాల్లో వ్యాపారులు ప్రమాణాలు పాటించని కారణంగా ప్రజలకు నాణ్యత లేని, నాసిరకం ఆహారం అందుతోంది. మహబూబ్‌నగర్‌లో సుమారు 70కిపైగా హోటళ్లు ఉండగా.. టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వంద వరకు ఉంటాయి. బయట చూసేందుకు అందంగా ముస్తాబై ఉన్న హోటళ్లు ఆహారం విషయంలో మాత్రం నాణ్యత పాటించడం లేదు.
ఆహారం తనిఖీ చేస్తున్న ఫుడ్ ఇన్‌స్పెక్టర్
లైసెన్స్ రద్దు చేశాం..
ఆహార తయారీలో సింథటిక్ కలర్స్ వాడరాదు. కిచెన్, ఇతర పరిసరాలు హైజెనిక్ కండీషన్‌లో పెట్టుకోవాలి. ఇకపై జిల్లాలో రెగ్యులర్‌గా తనిఖీలు చేపడుతాం. కొత్తగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల కేటాయింపు కూడా జరిగింది. ఇటీవల చేసిన సంతోష్ ఫుడ్ ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేశాం. ఇకపై వారు ఆహార పదార్థాలు తయారు చేసి అమ్మ కూడదు. – విజయ్‌కుమార్,
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment