నారాయణపేట: ప్రజల ఆరోగ్యాలను కాపాడటంలో ఆహర్నిశలు పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు నిర్ణయించి అమలు చేసేదాకా పోరాటం ఆగదని ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. ఆదివారం ఆశాల రాష్ట్ర బస్సుజాత నారాయణపేటకు చేరుకోవడంతో జిల్లా ఆశ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బోనమెత్తి తమ సమస్యలను, తమ గోడును ప్రభుత్వం వినాలని బతుకమ్మ ఆడారు. ప్రజానాట్య మండలి కళాకారులు హనుమంతు బృందం ఆధ్వర్యంలో కళారూపాలను ప్రదర్శించారు. ప్రధాన రోడ్డు గుండా ర్యాలీ చేపడుతూ సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. టార్గెట్లు పెట్టి పని చేయించడం, పనికి తగ్గ పారితోషికం అంటూ ఆశా కార్యకర్తలను వేధించడం, శ్రమ దోపిడీకి గురి చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఆరోగ్యం పైన పెట్టే బడ్జెట్‌ను తగ్గిస్తూ పోతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆశాల కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనాలు ఇవ్వాలి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ ఆశాలు, అంగన్‌వాడీలు, మధాహ్న భోజన కార్మికుల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కానీ, ఆయా కార్మికులకు కనీస వేతనం నిర్ణయించి అమలు చేసే విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో ఆశా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగామణి కోశాధికారి సునీత , రాష్ట్రనేత నారాయణ పేట జిల్లా అద్యక్షులు బాలమణి, నాయకులు వెంక ట్రామిరెడ్డి, బాల్‌రాం, గౌరమ్మ, గోపాల్, బాలప్ప, అంజిలయ్య గౌడ్ పాల్గొన్నారు.
ఆశా వర్కర్స్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment