‘సైబర్’ మాయ..!
దైనందిన జీవితంలో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో ప్రజలు ఆన్‌లైన్, మొబైల్ సేవలపై ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్ల్లు, లింక్‌లతో మభ్యపెట్టి అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్న ఎందరో డబ్బులతో పాటు ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసానికి గురైన వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరు.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సైబర్ మోసాల కేసుల శాతం.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
● రూ.1.30 లక్షలు ఇస్తే మీకు స్టాఫ్ నర్స్ ఉద్యోగం గ్యారంటీ అంటూ ఓ ఆజ్ఞాత వ్యక్తి నారాయణపేట జిల్లా కోస్గి పరిధిలోని ఓ మహిళకు ఫోన్ చేశారు. ముందుగా రూ.20 వేలు అడ్వాన్స్‌గా వేయాలని సూచించారు. తమ దగ్గర ఇప్పుడు అంతా అమౌంట్ లేదని.. రూ.10 వేలు ఉన్నాయంటూ ఆ మహిళ సదరు వ్యక్తి చెప్పిన నంబర్‌కు అమౌంట్ వేసింది. ఆ తర్వాత ఆమె డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని ఓ ఉద్యోగికి ఫోన్ చేసింది. అలాంటిదేమీ లేదని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది.
● నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన ఓ వ్యాపారికి ఫిబ్రవరి 2వ తేదీన అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను బ్యాంకు అధికారిగా చెబుతూ.. ఏటీఎం కార్డు రెన్యువల్ కోసం ఓటీపీ కావాలని అడిగాడు. బాధితుడు ఓటీపీ నంబర్ చెప్పగా ఆయన ఖాతాలోని రూ.6,99,000 మాయమయ్యాయి. షాక్ తిన్న బాధితుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు.
● నారాయణపేట జిల్లా కేంద్రంలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఇద్దరు గర్భిణుల బ్యాంక్ అకౌంట్ల నుంచి ఒకే రోజు డబ్బులు మాయమయ్యాయి. 14వ వార్డులోని అంగన్‌వాడీ–2 టీచర్‌కు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి హిందీలో మాట్లాడారు. అంగన్‌వాడీ సెంటర్ వివరాలు కావాలని.. గర్భిణితో మాట్లాడుతానని చెప్పి వివరాలు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆ గర్భిణి అకౌంట్‌లో రూ.25 వేలు మాయం కాగా.. ఇదే తరహాలో మరికల్‌లోని అంగన్‌వాడీ–5 సెంటర్‌కు చెందిన ఓ గర్భిణి అకౌంట్ నుంచి రూ. 3 వేలు మాయమయ్యాయి.
కొల్లగొట్టింది రూ.10 కోట్లు.. రికవరీ రూ.28.15 లక్షలే..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సైబర్ కేటుగాళ్లు ఈ సంవత్సరంలో అమాయకుల నుంచి రూ.10.05 కోట్లు కొల్లగొట్టారు. ఇందులో 28.15 లక్షలు మాత్రమే రికవరీ కాగా..పోలీసులు న్యాయప్రక్రియ పూర్తి చేసి ఆయా బాధిత వ్యక్తులకు అంద జేశారు. బ్యాంకుల్లో ఫ్రీజ్ అయినవి సుమారు రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అంటే సైబర్ కేటుగాళ్లు మిగతా సొమ్మును మింగేసినట్లు అర్థమవుతోంది.
ఇలా మోసపోతున్నారు..
జిల్లాలో నమోదైన సైబర్‌క్రైం కేసుల్లో అధికంగా వేక్ యాప్‌లలో అధిక లాభాలకు ఆశపడి పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారే ఉన్నారు. ఏపీకే యాప్ లింక్‌లపై టచ్ చేసి ఖాతాల్లోని నగదును పొగొట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో రుణం ఇప్పిస్తాం.. కొంత డబ్బులు డిపాజిట్ చేయాలని, క్రెడిట్ కార్డు బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పి ఆన్‌లైన్‌లో లింక్‌లు పంపించి.. ఫోన్ కాల్స్, బ్యాంక్ ఏటీఎంల పేరుతో నగదు అపహరించినట్లు కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్న వారిలో విద్యాధికులే ఉండడం గమనార్హం. అత్యాశే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నా..
సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ప్రతి సంవత్సరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది సైతం క్షేత్రస్థాయిలో వ్యాపారులతో పాటు మున్సిపాలిటీల పరిధిలోని కాలనీల్లో, మండలాల పరిధిలో గ్రామాల్లో విస్తృతంగా అవగాహన క్యాక్రమాలు చేపట్టింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 483, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,080, నారాయణపేటలో 328, గద్వాల, వనపర్తిలో 400 వరకు అవగాహన సదస్సులు నిర్వహించారు. అయినా సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన రేపుతోంది.
జిల్లాల వారీగా నమోదైన సైబర్ నేరాలు ఇలా..
ఈ ఏడాది అమాయకుల నుంచి రూ.10 కోట్ల మేర దోపిడీ
ఉమ్మడిపాలమూరునుబెంబేలెత్తిస్తున్న సైబర్ మోసాలు
గత సంవత్సరంతో పోలిస్తే 15.42 % పెరిగిన నేరాలు
అన్ని జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే స్వాధీనం
జిల్లా; 2023–24 ;2024–25
మహబూబ్ నగర్; 951; 1,451
నాగర్ కర్నూల్; 442; 672
జోగుళాంబ గద్వాల; 278; 512
నారాయణపేట; 46; 25
వనపర్తి; 49; 64
Comments
Please login to add a commentAdd a comment