జిల్లాలో ఆపరేషన్ స్మైల్
ఆపరేషన్ స్మైల్, ముస్కాన్‌తో బాలల జీవితాల్లో వెలుగులు
వెట్టి నుంచి బాలలకు విముక్తి కల్పించడమే లక్ష్యం
ఆరేళ్లలో 1,002 మందిబాలకార్మికుల గుర్తింపు
ప్రత్యేక బృందాలతో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
నారాయణపేట: బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఈమేరకు జిల్లాలో తనిఖీలు నిర్వహించి హోటళ్లు, పత్తి చేళ్లు, ఇటుక బట్టీలు తదితర వాటిలో పనిచేస్తున్న బాలలను గుర్తించి వారిని వెట్టి నుంచి విముక్తి కల్పిస్తున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ దిశా నిర్దేశంతో శుక్రవారం (నేటి) నుంచి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మరోసారి బాలకార్మికులను గుర్తించే పనిలో అధికార బృందాలు నిమగ్నం కానున్నారు.
ప్రత్యేక బృందాలతో దాడులు
బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్‌ఐతో పాటు పోలీస్ సిబ్బంది, కార్మికశాఖ, చైల్డ్‌లైన్ 1098, సీ్త్రశిశు సంక్షేమశాఖ, బాలరక్ష భవన్, సఖీ, ఐసీడీసీ అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా దాడులు చేపడతారు. పని ప్రదేశాలపై దాడులు చేపట్టి 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల చిన్నారులను గుర్తించి నిర్వహిస్తారు. చిన్నారులను చేరదీసి వారు వదిలేసిన పాఠశాలల తరగతుల్లో చేర్పిస్తారు. అయితే, పాఠశాలల్లో పాఠాలు వినాల్సిన బాలలు ఎందరో వారి తల్లిదండ్రులతో పొలం పనులకు, గొర్రెల కాపరులుగా, పరిశ్రమల్లో పనిచేసేందుకు వెళ్తుంటారు. ఇటుక బట్టీల యాజమానులు, పరిశ్రమల యజమానులు, వ్యాపారస్థులు, పిల్లలను పనిలో పెట్టుకునేందుకు ప్రొత్సహిస్తుంటారు. దీంతో బాలకార్మికులుగా మారుతున్నారు. ఫ్యాక్టరీల చట్టం 1948, వెట్టి చాకిరీ చట్టం –1976 ప్రకారం బాలబాలికలను పనుల్లో పెట్టుకోవడం నేరం. బాలకార్మిక నిషేధ చట్టం 1986 ప్రకారం ప్రమాదకర పనుల్లో, పరిశ్రమల్లో 14 ఏళ్ల వయస్సులోపు బాలబాలికలతో పనిచేయించకూడదు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే యాజమానులకు రూ.10 వేల నుంచి రూ.20 వేల పైగా జరిమానాలు విధిస్తారు.
1,002 మంది బాలకార్మికుల గుర్తింపు
2019 నుంచి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో అపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,002 మంది బాలకార్మికులను గుర్తించారు. బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని చెప్పినా వినని వారిపై గత రెండేళ్లుగా 37 కేసులు సైతం నమోదుచేశారు. వారికి ఫైన్‌లు విధించారు. ఇదిలాఉండగా, పిల్లల హక్కులను కాపాడేందుకు పోలీసు విభాగం, ఇతర విభాగాలు కలిసి బృందాలుగా ఏర్పడి బస్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, ఇతర ప్రదేశాలను సందర్శించి బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, బాల కార్మికులుగా పని చేస్తున్న చిన్నారుల సమస్యలను పరిష్కరించడం, అక్రమ రవాణాకు గురైన వారిని రక్షించడం, వారికి పునరావాసం కల్పించి, చట్టపరమైన హక్కులు, రక్షణ కల్పిస్తారు.
బాలలతో పనిచేయిస్తే కేసులే : డీఎస్పీ
నారాయణపేట: 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు బాలలను పనిలో పెట్టుకుంటే యాజమానులపై కేసులు తప్పవని డీఎస్పీ ఎన్.లింగయ్య హెచ్చరించారు. గురువారం స్థానిక ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్‌హాల్లో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన అధికారుల సమీక్ష సమావేశంలో డీఎస్పీ పలు సూచనలు చేశారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి అన్ని డిపార్ట్‌మెంట్ అధికారులు కలిసికట్టుగా పనిచేసి బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. గల్లంతైన బాల కార్మికులుగా బాధపడుతున్న పిల్లలను రక్షించడం సమాజ పునాదులను బలోపేతం చేయడంలో కీలకమైన చర్య అని, పిల్లల భవిష్యత్తును రక్షించడం ద్వారా సమాజంలో ఒక శక్తివంతమైన మార్పును తీసుకురావచ్చు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు మురళీ, సునిత,డీఈఓ గోవిందరాజులు, సీడబ్ల్యూసీ మెంబర్ యాదయ్య, డీసీపీఓ తిరుపతయ్య, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ నరసింహ, మెడికల్ డిపార్ట్‌మెంట్ నరసింహ రావు,లేబర్ డిపార్ట్‌మెంట్ తిలక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment