మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించాలి
నారాయణపేట: జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, వాటి వల్ల కలిగే అనర్ధాలపై జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నార్కోటిక్ డ్రగ్స్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు జరగకుండా నిఘా పెట్టాలని, అన్ని కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ఆబ్కారీ శాఖ అధికారులు నిఘా ఉంచాలని, జిల్లా వైద్యశాఖ అధికారులు సైతం ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల నెలవారి సమావేశాలలో డ్రగ్స్ నిషేధం పై తెలిపి క్షేత్రస్థాయిలో వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ.. కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆబ్కారీ శాఖ అధికారి అశోక్ కుమార్ ఇటీవలే పట్టుకున్న ఆల్ఫాజోలం వివరాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీఓ రామచంద్రనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, డిఇఓ గోవిందరాజులు, డిఐఈఓ సుదర్శన్, ఆర్టీవో మేఘా గాంధీ పాల్గొన్నారు.
నిబంధనల మేరకు ఇసుక సరఫరా
జిల్లాలో గుర్తించిన ప్రాంతాలలో నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. తమ పట్టా భూముల్లో ఇసుక తొలగించాలని రైతులు దరఖాస్తు చేసుకోగా ఈమేరకు డిస్టిక్ లెవెల్ స్యాండ్ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో నిర్వహించారు. మైనింగ్ ఏడి సంజయ్ కుమార్ నివేదికలన్ని సరిగ్గా ఉన్నాయని తెలిపడంతో అన్ని శాఖల అధికారుల రిపోర్టుల ఆధారంగా అనుమతికి కలెక్టర్ అంగీకారం తెలిపారు. అయితే ఇసుకను తరలించేందుకు ఎన్ని వాహనాలు, ఎన్ని రోజులు సమయం పడుతుందని ఆరా తీస్తూ.. సీసీ కెమెరాలు, వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ, పంచాయతీ కార్యదర్శులతో కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేసి ఇసుక తరలింపుపై పర్యవేక్షణ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 12 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ బెన్ శాలం, ఆర్డీఓ రామచందర్, ఏవో జయసుధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment