ఆదర్శం.. అమరచింత ఎత్తిపోతలు
ఎత్తిపోతల పంప్‌హౌజ్
అమరచింత: రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చింది. నాటి ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి నాబార్డు సహకారంతో అమరచింత మండలంలో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ 24 ఏళ్లుగా ఆయకట్టుకు నిర్విరామంగా సాగునీటిని అందిస్తూ ఇతర వాటికి ఆదర్శంగా నిలుస్తోంది. రైతుల భాగస్వామ్యంతో కొనసాగుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శ లిఫ్ట్‌గా అవార్డు కూడా అందుకుంది. చిన్న చిన్న మరమ్మతులను ఎప్పటికప్పుడు చేయిస్తూ అనుకున్న ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రతి ఏటా వానాకాలం, యాసంగి పంటలకు సాగునీటిని అందిస్తుండగా.. గతేడాది యాసంగికి మాత్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రాప్ హాలీడే ప్రకటించారు.
సమష్టి కృషితోనే..
అమరచింత ఎత్తిపోతల పథకం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఆయకట్టు రైతులందరం కలిసి సమష్టిగా నిర్ణయాలు తీసుకోవడంతోనే నిర్వహణ సజావుగా సాగుతోంది. రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులతో మరమ్మతులు చేపడుతుండటంతో ఇప్పటి వరకు నిరంతరాయంగా కొనసాగుతూ ఇతర లిఫ్ట్‌లకు ఆదర్శంగా నిలుస్తోంది.
– సౌజన్యారెడ్డి,
లిఫ్ట్ అధ్యక్షురాలు, అమరచింత
రైతుల సహకారంతోనే..
అమరచింత ఎత్తిపోతల పథకం నిర్వహణలో రైతులు సమష్టిగా ముందుకు సాగుతున్నారు. పంట కిస్తులు వసూలు చేసి బ్యాంకులో జమ చేస్తుండటంతో ఎలాంటి మరమ్మతులు వచ్చినా ప్రభుత్వంపై ఆధారపడకుండా నిర్వహణ కమిటీ ద్వారా వెంటనే చేపడుతున్నారు. లిఫ్ట్ నిర్వహణను నీటిపారుదలశాఖకు అప్పగించినప్పటికీ రైతులు పూర్తి సహకారం అందిస్తుండటంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతోంది.
– ఆంజనేయులు,
ఏఈ, భారీ నీటిపారుదలశాఖ
సాగునీటికి ఇబ్బందిపడ్డాం..
గత కొన్నేళ్లు సాగునీరు అందక పొలాలు బీడువారి అమ్ముకొనే పరిస్థితికి వచ్చాం. అమరచింత ఎత్తిపోతల పథకం నిర్మించాక సాగునీరు సమృద్ధిగా అందుతోంది. వానాకాలం, యాసంగిలో వరి సాగు చేసుకుంటున్నాం. లిఫ్ట్ నిర్వహణ కోసం రైతులందరం కలిసి క్రమం తప్పకుండా పంట కిస్తులు చెల్లిస్తూ మేము లబ్ధి పొందుతున్నాం. – కృష్ణారెడ్డి, రైతు, అమరచింత
బీడు భూములు
సస్యశ్యామలం
జూరాల జలాశయం ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానంగా లిఫ్ట్ కాల్వను ఏర్పాటు చేయడంతో సాగునీరు సమృద్ధిగా అందుతోంది. దీంతో ఇక్కడి రైతులు ఏడాదికి రెండుసార్లు వరి సాగుచేస్తున్నారు. బీడు భూముల్లో సైతం పంటలు సాగు చేస్తుండటంతో పచ్చని వాతావరణం నెలకొంది.
●
24 ఏళ్లుగా సాగునీరు అందిస్తున్న లిఫ్ట్
1,090 మంది రైతుల భాగస్వామ్యం
మొత్తం ఆయకట్టు 4,200 ఎకరాలు.. సాగులో 1,100 ఎకరాలు
Comments
Please login to add a commentAdd a comment