‘భూభారతి’పై ఎన్నో ఆశలు
‘ధరణి’ సమస్యలకు పరిష్కారం చూపేనా..
పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలిగేనా..
ఉమ్మడి జిల్లాలో 25,218 సాదాబైనామా అర్జీల పెండింగ్
ఇతర సమస్యలపై సుమారు 9,263..
మార్గదర్శకాలపై రైతుల్లో ఆసక్తి
1996లో సాదాబైనామాపై భూమి కొన్న..
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నారాయణపేట జిల్లా మద్దూర్ మండలకేంద్రానికి చెందిన సంజీవరెడ్డి. 1996లో సర్వే నంబర్ 71లో 30 గుంటల భూమిని ఆతడు చిన్నాన్న అయినా సుభాన్‌రెడ్డి దగ్గర బాండ్ పేపర్‌పై భూమి కొన్నట్లు రాసుకున్నారు. ఈ భూమిని తన పేరు మీద చేయాలని గత ప్రభుత్వంలో సాదా బైనామా కోసంమీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వమైన సాదాబైనమాలపై దృష్టి సారించి పరిష్కారం చేయాలని ఆయన కోరుతున్నారు.
..ఇలా ఇతనొక్కడే కాదు.. సాదాబైనామా కింద యాజమాన్య హక్కుల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. అంతేకాదు.. ధరణి పోర్టల్‌లో లోపం, వివిధ కారణాలతో భూ యాజమాన్య హక్కులు పొందలేకపోయి..అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేస్తున్న వారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానున్న భూభారతి పోర్టల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: భూ వివరాలు పారదర్శకం, సమస్యల పరిష్కారానికి సులువైన మార్గమంటూ గత ప్రభుత్వం 2019లో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భూముల క్రయవిక్రయాలతో పాటు రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా ఆ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు భూ సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన రైతాంగానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. చాలా గ్రామాల్లో భూ సమస్యలకు పరిష్కారం దొరక్క గొడవలు చెలరేగాయి. పలువురు కేసుల్లో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మండల తహసీల్దార్ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో భూసమస్యలు, వివాదాలపైనే ఎక్కువగా ఉండడం గమనార్హం.
జఠిలంగా మారిన సమస్యలు..
డిజిటల్ పట్టాదారు పాస్‌పుస్తకంలో కాస్తు కాలం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో పలు కుటుంబాల మధ్య జగడాలు చోటుచేసుకున్నాయి. పట్టాదారుకు సర్వహక్కులు కల్పించడం.. ఎవరి ప్రమేయం లేకుండా భూముల క్రయవిక్రయాలకు ఆస్కారం కల్పించడంతో వివాదాలు తలెత్తి ఉమ్మడి కుటుంబాల్లో చిచ్చు రాజేశాయి. సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ నుంచి మొదలు జిల్లాస్థాయి అధికారులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కకపోవడంతో బాధిత రైతుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. గ్రామాల్లో పెద్ద మనుషుల మధ్య తాత్కాలిక ఒప్పందాలు జరిగినా.. సమస్యలు మరింత జఠిలంగా మారాయి.
సాదాబైనామా దరఖాస్తులు 25,218..
సాదా కాగితాలపై భూములు కొనుగోలు చేసి కాస్తులో ఉంటూ పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపశమనం కలిగించేందుకు గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 2020 జూన్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 25,218 దరఖాస్తులు వచ్చాయి. కాస్తులో ఉన్నప్పటికీ భూమి అమ్మిన వారి సమ్మతి తీసుకోవాలనే నిబంధన, అమ్మిన వారి పేరున భూమి లేకపోవడం వంటి సమస్యలతో పాటు కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో వాటి క్రమబద్ధీకరణకు అడుగులు ముందుకుపడలేదు. తాజాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ఇబ్బందులు, సాదాబైనామాల క్రమబద్ధీకరణలో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా భూభారతి పోర్టల్, ఆర్వోఆర్–2024 చట్టం తీసుకొచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నూతన ఆర్వోఆర్ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో సాదాబైనామా దరఖాస్తుదారుల్లో ఆశలు రేకెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment