ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం.. నగర, పట్టణ ప్రాంతాల్లో కరువైన స్వచ్ఛమైన గాలి.. ఉద్యోగ, వ్యాపారాల్లో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్న ప్రజలు.. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీశాఖ చేపట్టిన టైగర్ స్టే ప్యాకేజీ, టైగర్ సఫారీ పర్యాటక ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణ రోజుల కన్నా శని, ఆదివారాలు, సెలవు దినాల్లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల నెలరోజుల వ్యవధిలోనే సఫారీ సందర్శకులకు రెండు సార్లు పెద్దపులి కనిపించడం విశేషం. దీంతో టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ కోసం మరింత మంది సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. – సాక్షి, నాగర్‌కర్నూల్/ మన్ననూర్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ అధికారులు టైగర్ సఫారీ ద్వారా పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నల్లమలలో 34 వరకు పెద్ద పులులు, వందకుపైగా చిరుతలు, ఎలుగుబంట్లు, వందల సంఖ్యలో జింకలు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు, అడవి కుక్కలు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణించే సందర్శకులకు తరుచుగా ఈ వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ఇటీవల డిసెంబర్ నెలలోనే సందర్శకులకు రెండుసార్లు పెద్ద పులులు కన్పించాయి. ఎలుగు బంట్లు, జింకలు, మనుబోతులు ఇక్కడికి వస్తున్న సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నల్లమలను సందర్శించాలనుకునే పర్యాటకులు అటవీశాఖ టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ ట్రిప్‌ను అందిస్తోంది. సఫారీ వాహనంలో ప్రయాణించాలనుకునే సందర్శకులు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఉన్న ఫర్హాబాద్ గేటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment