● మహబూబ్‌నగర్ డీఎంపై సస్పెన్షన్ వేటు
వనపర్తి: జిల్లా పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ డీఎంగా కేవలం ఐదు నెలలు పనిచేసిన షేక్ ఇర్ఫాన్ అవినీతి బాగోతం ఆధారాలతో సహా ఈటీఎఫ్–2 డీఎస్పీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ కార్పొరేషన్ ఎండీ డీఎస్ చౌహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన 2024, జూన్ 19 నుంచి 2024, నవంబర్ 7 వరకు వనపర్తి జిల్లాలో డిప్యుటేషన్‌పై పనిచేశారు. ఈ వ్యవధిలో జిల్లాకేంద్రంతో పాటు పెబ్బేరు, ఖిల్లాఘనపురం, చిన్నంబావి, ఆత్మకూరు మండలాల్లోని పలువురు మిల్లర్లతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఈటీఎఫ్–2 అధికారులు నివేదికలో ఫోన్ పే ఐడి నంబర్లతో పేర్కొనడం గమనార్హం. సీఎంఆర్ ధాన్యం ఇప్పిస్తానని పెబ్బేరు మండలంలోని సత్య ఇండస్ట్రీస్ యజమానుల నుంచి, ఖిల్లాఘనపురంలోని బాలాజీ రైస్‌మిల్లులో తక్కువగా ఉన్న 80 వేల బస్తాల విషయాన్ని తనిఖీ నివేదిక నుంచి తొలగించేందుకు రూ. నాలుగు లక్షలు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. చిన్నంబావి మండలం వెలగొండలో ఉన్న మిల్లర్ వద్ద సుమారు 40 వేల బస్తాల లోటును విచారణ నివేదికలో తొలగించేందుకు రూ.10 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు విచారణ అధికారులు తేల్చారు. దీంతోపాటు ఆత్మకూర్‌లోని షిర్డీసాయి ట్రేడర్స్ మిల్లుకు సంబంధించి ఐదు ఏసీకేల బియ్యం సీఎస్సీకి టెక్నికల్ అసిస్టెంట్ ఆమోదం తెలిపేందుకు రూ.లక్ష వసూలు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇతడికి సహకరించిన అధికారులపైనా వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్‌కు గురైన షేక్ ఇర్ఫాన్ గతంలో రెండు పర్యాయాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు సమాచారం. అయితే, రంగారెడ్డి జిల్లాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న రవినాయక్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment