ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
మాగనూర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల అన్నారు. గురువారం మండలంలోని కేజీబీవీ 9, 10వ తరగతి విద్యార్థులకు కేరీర్ గైడెన్స్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ట్రైనీ కలెక్టర్ హాజరై మాట్లాడారు. పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న విద్యాకోర్సులు, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే భవిష్యత్ ప్రణాళికపై విద్యార్థినులకు సమగ్ర అవగహన కల్పించారు. భవిష్యత్‌లో సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి అనుగుణంగా, వ్యక్తిగత ఆసక్తి, లక్ష్యాలను గుర్తించడం ఎంత ముఖ్యమో వివరించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్, జీసీడీఓ నర్మద, ఎస్‌ఓ రాధిక,, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలి
ఊట్కూరు: మహిళలు స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని పెద్దజట్రం రైతు వేదికలో షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం– నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత మూడు నెలల కుట్టు శిక్షణ కేంద్రాన్ని న్యాక్ డైరెక్టర్ రాజారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇంతవరకు 11 వేల మంది శిక్షణ పొందగా 9 వేల మంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు. మహిళలకు వివిధ రంగాలలో ఒప్పందం చేసుకొని శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని తెలిపారు. శిక్షణ కోసం ఇప్పటి వరకు రూ.120 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రాష్ట్రంలో 20 శిక్షణ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తున్నారని అన్నారు. జిల్లాలో 3 నెలలపాటు ఉచిత శిక్షణ అందించి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తామని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు, పాఠశాలలు, హాస్టళ్ల యూనిఫామ్స్ కుట్టడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డర్‌లు పొంది ఉపాధి పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఈడి అబ్దుల్‌కలీల్, డీపీఆర్‌ఓ రశీద్, మండల స్పెషల్ ఆఫీసర్ ఉమాపతి, శివశంకర్, ఆజమ్మ, సాయిలుగౌడ్, కత్తలప్ప, అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
Comments
Please login to add a commentAdd a comment