రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మక్తల్: జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్‌స్పాట్) గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు సమగ్ర చర్యలు చేపట్టామని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం మక్తల్ పరిదిలో జాతీయ రహదారి, పలు రహదారులను ఎస్పీ పరిశీలించారు. ఈమేరకు జక్లేర్, కాచ్‌వార్‌రోడ్డు, దండు క్రాస్ రోడ్, నల్లజానమ్మరోడ్డు, మక్తల్ బస్టాండ్ చౌరస్తా, కన్యకా పరమేశ్వరి ఆలయం, దాసర్‌పల్లి క్రాస్‌రోడ్డును పరిశీలించారు. మలుపులు, గ్రామాల నుంచి ప్రధాన రహదారి కలిసే చోట ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధాన చౌరస్తాల్లో బారికేడ్లు, స్పీడ్ నియంత్రణ, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, మలుపుల వద్ద రేడియం స్టికర్లతో బోర్డులను వేయించాలని హైవే అధికారులను ఆదేశించారు. రాత్రి సమయంలో జాతీయ రహదారితోపాటు ఇతర రోడ్లపైన వాహనాలు ఎట్టి పరిస్థితిలో నిలపవద్దని, హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ అప్రమత్తం చేయాలన్నారు. అతివేగంగా వాహనాలను నడిపే వారికి, నిబంధనలు పాటించని వాహనదారులకు చలాన్లు విధించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. వాహనాలను నడిపేవారు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, ఏఈ అభిషేక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment