![ఉద్యమ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06nrpt301-210086_mr-1738869670-0.jpg.webp?itok=NIh9_PVQ)
ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు
మరికల్: కృష్ణా జలాల కేటాయింపులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి అన్నారు. మరికల్ యువక మండలి భవనంలో గురువారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన అఖిలపక్షం నాయకులు, కుల సంఘాలు, యువకులు, రైతులు ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నీళ్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం రాఘవచారి మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసే పాలకులు లేకపోవడం వల్లే ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేటాయించిన కృష్ణా జలాల విషయంలో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఏదుల నుంచి డిండికి నీటిని ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 11ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఎత్తయిన షాద్‌నగర్ ప్రాంతంలో ఎత్తిపోతల ద్వారా కాల్వలు తీసి అక్కడ 30 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మిస్తే పాత పాలమూరు జిల్లా అంతటా 35 లక్షల ఎకరాలకు సాగునీరు పారే అవకాశం ఉందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించిన 90 టీఎంసీలను ఫేజ్–1, ఫేజ్–2గా విభజించి 45 టీఎంసీల నీటిని నారాయణపేట కొడంగల్ ప్రాంతానికి కేటాయిస్తే ఈ ప్రాంతంలో వలసలు పూర్తిగా నివారించవచ్చన్నారు. ఇందుకోసం ఈ ప్రాంత ప్రజలు, నాయకులు లేఖల ద్వారా నిరంతరం ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందజేయాలని సూచించారు. అలాగే కోయిల్‌సాగర్, భీమాఫేజ్–1కు పూర్తి స్థాయి నీటిన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో కోయిల్‌సాగర్ చివరి ఆయకట్టు వరకు ధ్వంసమైన పాత కాల్వలను, తూములను మరమ్మతులు చేయాలన్నారు. నారాయణపేట జిల్లాకు రావాల్సిన నీటిపై అప్రమత్తంగా ఉంటేనే భవిష్యత్ తరాలకు మార్గం చూపిన వారమవుతామన్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తీసుకరావాలని పిలుపునిచ్చారు. పాలమూరు నీటి పంపకాల విషయంపై ప్రధాని నరేంద్రమోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి కూడా వినతి పత్రాలు ఇస్తామన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కో కన్వీనర్ సుదర్షన్ టీఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్, చైతన్యా మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి, సూర్యప్రకాష్, గోపి, వీరన్న, రాజు, రాములు, హరీష్, విష్ణు, అయ్యప్ప, లక్ష్మయ్య తధితరులు పాల్గొన్నారు.
పేట – కొడంగల్‌కు నీటిని కేటాయించాలి
పాలమూరు – రంగారెడ్డికి కేటాయించిన 90 టీఎంసీల నీటిని రెండుగా విభజన చేసి 45 టీఎంసీల నీటిని నారాయణపేట, కొడంగల్‌కు కేటాయిస్తే ఇక్కడ నుంచి లక్ష్మిదేవిపల్లికి తీసుకుపోవచ్చు. ఈ మధ్యలో కాల్వల ద్వారా ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ విషయంపై ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావాలి.
– వెంకట్రాములు, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు
గ్రామాల్లో చర్చ జరగాలి
ఉమ్మడి పాలమూరుకు దక్కాల్సిన నీటి వనరులపై గ్రామాల్లో చర్చ జరిగితేనే పాలకులకు కనువిప్పు కలుగుతుంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి డిండి పేరుతో 30 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆ ప్రాంత పాలకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని తిప్పి కొట్టెందుకు పాలమూరు రైతులు ఏకం కావాలి. అలాగే కోయిల్‌సాగర్, సంగంబండ రిజర్వాయర్ల స్థాయి కూడా పెంచితే రైతులకు న్యాయం జరుగుతుంది.
– తిమ్మప్ప, పాలమూరు అధ్యయన వేదిక మహబూబ్‌నగర్ అధ్యక్షుడు
ఇథనాల్ కంపెనీకి
నీటిని నిలిపివేయాలి
జూరాల నుంచి కోయిల్‌సాగర్‌కు తరలించే 2 టీఎంసీల నీటిలో ఇథనాల్ కంపెనీకి తరలించే ఒక టీఎంసీ నీటిని నిలిపివేయాలి. కంపెనీ వల్ల భవిష్యత్‌లో చుట్టుపక్కల 50 గ్రామాలకు కాలుష్యంతో కూడిన నీళ్లు, గాలి వ్యాపించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కలుషిత నీరు మన్నెవాగులో వదలడం వల్ల పశువులు ఆ నీటిటి తాగి మృత్యువాత పడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కంపెనీని రద్దు చేసి ఈ ప్రాంత ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. – చక్రవర్తి,
ఇథనాల్ కంపెనీ పోరాట కమిటీ సభ్యుడు
ప్రశ్నించకపోతే ఏడారే..
ఉమ్మడి పాలమూరు జిల్లాకు దక్కాల్సిన కృష్ణా జలాలను నల్లగొండ జిల్లాకు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ప్రశ్నించకపోతే పాలమూరు జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మళ్లీ మనం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నారాయణపేట– కొండగల్ ప్రాజెక్టుకు రావాల్సిన నీరు రాకుండా కుట్ర జరుగుతుంది. దీనిని ఇలాగే వదిలేస్తే కరువు చాయలు కమ్ముకోవడం ఖాయం. మన నీళ్ల కోసం ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది.
– చంద్రశేఖర్, కేఎన్‌పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మక్తల్
●
కృష్ణా జలాలపై ప్రశ్నిద్దాం
నల్లగొండ నీటి తరలింపు జీఓ 11ను రద్దు చేయాలి
90 టీఎంసీల నీటిని రెండు భాగాలుగా విభజించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవచారి
![ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06nrpt302-210086_mr-1738869670-1.jpg)
ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు
![ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు 2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06nrpt304-210086_mr-1738869670-2.jpg)
ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు
![ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు 3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06nrpt303-210086_mr-1738869670-3.jpg)
ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు
![ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు 4](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06nrpt305-210086_mr-1738869670-4.jpg)
ఉద్యమిస్తేనే పాలమూరుకు నీళ్లు
Comments
Please login to add a commentAdd a comment