ముంబై: మైనర్ భార్య అంగీకారంతో శృంగారం చేసినా అది అత్యాచారమే అవుతుందని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అలాంటి చర్యకు చట్ట ప్రకారం రక్షణ ఉండదని తెలిపింది. భార్య వయసు 18 ఏళ్ల లోపు ఉండి.. ఆమె అంగీకారంతో కలిసినా, ఇష్టం లేకుండా కలిసినా అది అత్యాచారం కిందనే పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. భార్యపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆమె వివాహం చేసుకుందా? లేదా? అన్న దానితో సంబంధం లేకుండా 18 ఏళ్లలోపు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగానే పరిగణించాలని జస్టిస్ జేఏ సనప్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. భార్య లేదా అమ్మాయి వయసు 18 ఏళ్లు కంటే తక్కువ ఉన్నప్పుడు ఆమె అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నప్పటికీ రక్షణ అందుబాటులో ఉండదని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో కింది కోర్టు నిందితుడికి విధించిన 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను చెంచ్ సమర్థించింది.
కేసు పుర్వాపరాలు.. మహారాష్ట్రలోని వార్దాలో బాలిక తన తండ్రి, అక్కలు, నానమ్మతో కలిసి నివసించేది. ఇంటికి సమీపంలో ఉండే వ్యక్తి బాలికతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి లైంగిక సంబంధానికి దారితీసింది. ఇది ఇలా నాలుగేళ్లు కొనసాగింది. కొన్నాళ్లుగా బాలిక గర్భం దాల్చగా.. ఆమె కుటుంబ సబ్యుల ఒత్తిడితో ఓ గదిలో తక్కువ మంది సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం అతని ప్రవర్తనలో మార్పు వచ్చి.. బాలికను అబార్షన్ చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో ఆమెపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో.. బాధితురాలు అతనిపై 2019 మే లో అత్యాచారం కేసు పెట్టింది.
ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా..కోర్టు పదేళ్ల జైలు శిక్షవిధించింది. అయితే నిందితుడు తన లాయర్‌తో కలిసి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఆమె సమ్మతితోనే తాను శృంగారంలో పాల్గొన్నట్టు అతడు కోర్టుకు తెలిపాడు. ఈ కేసును పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. ఆమెపై లైంగికదాడి జరిగినపుడు వయసు 18 సంవత్సరాల లోపేనని రుజువు చేయడంతో ఇది రేప్ కేసు కిందికే వస్తుందని తెలిపింది. బాధితురాలికి ఇష్టం ఉండి కలిసినా, ఇష్టం లేకుండా కలిసినా అది రేప్ కేసే అవుతుందని స్పష్టం చేశారు. అంతేగాక డీఎన్ఏ పరీక్షల్లో బాధితురాలు జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి అతనేనని తేలింది. ఈ నేపథ్యంలో కింది కోర్టు విధించిన శిక్షను హైకోర్టు సమర్థించింది.
Comments
Please login to add a commentAdd a comment