సాక్షి, బెంగళూరు: కన్నడనాట కిల్లర్ కరోనా వైరస్ మరోదఫా విజృంభిస్తోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 2,792 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అదే సమయంలో 1,964 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత రెండునెలల్లో ఎన్నడూ లేని రీతిలో 16 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది.
9.89 లక్షలకు కేసులు
►తాజాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,89,804కు పెరిగింది.
►9,53,416 మంది కోలుకున్నారు. 12,520 మంది చనిపోయారు.
►రాష్ట్రంలో ప్రస్తుతం 23,849 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో 227 మంది రోగులు ఐసీయూలో ఉన్నారు.
►బెంగళూరులో 1,742 కేసులు
►సిలికాన్‌సిటీలో కొత్తగా 1,742 పాజిటివ్ కేసులు తేలాయి. 1,356 మంది కోలుకున్నారు. 9 మరణాలు నమోదయ్యాయి. బెంగళూరులో మొత్తం కేసుల సంఖ్య 4,29,915కు పెరగ్గా, అందులో 4,09,065 మంది బతికి బయటపడ్డారు. మరో 4,590 మంది చనిపోయారు. ప్రస్తుతం 16,259 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
►34.80 లక్షలకు చేరిన టీకాలు
♦రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 87,197 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 2,11,95,741కు చేరింది.
♦రాష్ట్ర వ్యాప్తంగా 56,374 మందికి కరోనా టీకా వేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34,80,930 మంది వ్యాక్సిన్ పొందారు.
కరోనాపై వారే మాట్లాడతారు: సీఎం
రాష్ట్రంలో లాక్‌డౌన్, కంటైన్మెంట్ జోన్‌లు, కరోనా ఆంక్షలు తదితరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ మాత్రమే ఆదేశాలు జారీ చేస్తాయి. ఇతరులు ఎవరూ మాట్లాడవద్దు అని సీఎం యడియూరప్ప ఇతర శాఖలకు స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం కృష్ణా అతిథి గృహంలో మంత్రులు, అధికారులతో ఆయన కరోనా నియంత్రణపై చర్చించారు. ఏ అధికారి, మంత్రి, ప్రజాప్రతినిధి కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని సూచించారు. మరోవైపు ఉప ఎన్నికల్లో కరోనా నియమాలను బేఖాతరు చేస్తూ భారీ రద్దీతో ర్యాలీలు, సభలు మొదలయ్యాయి. దీంతో కరోనా మరింత పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment