మండ్య: వితంతు మహిళను దుండగులు అత్యాచారం జరిపి, హత్య చేసి కాల్చివేశారు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన మద్దూరు తాలూకా మారసింగనహళ్లిలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన దివంగత కుమార ఆరాధ్య భార్య ప్రేమ (42)ను హతురాలిగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా బెంగళూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆమె కోడలు మండ్య మహిళా కాలేజీలో చదువుతోంది. మారసింగనహళ్లిలో టైలరింగ్ పనిచేస్తున్న ప్రేమ భర్త కుమార ఆరాధ్య పక్షవాతంతో మూడేళ్ల క్రితం మరణించాడు. తరువాత ప్రేమ గ్రామంలోని తన సొంతింట్లో చీటీలు నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. సోమవారం రాత్రి ఆమె ఇంట్లోకి నిద్రిస్తుండగా చొరబడిన దుండగులు తల దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆమెను చంపేశారు. మంచంతో సహా మృతదేహాన్ని కాల్చివేసి పరారయ్యారు.
ఇంట్లో నుంచి పొగలు వస్తుండడంతో..
మంగళవారం ఉదయం ప్రేమ ఇండి పడక గదిలో నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించి ఇరుగుపొరుగు వాసులు వచ్చి చూడగా ప్రేమ మరణించి ఉండడం చూసి నిర్ఘాంత పోయారు. బేసగరహళ్లి పోలీసులు జాగిలాల సహాయంతో పరిశీలించారు. హత్యకు ముందు నిందితులు పడక గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు గుర్తించారు. మండ్య మిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ పుట్టస్వామి నేతృత్వంలోని సిబ్బంది మంగళవారం సాయంత్రం ఘటన జరిగిన స్థలంలోనే పోస్టుమార్టమ్ నిర్వహించారు. మద్దూరు రూరల్ సీఐ మనోజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎన్.యతీశ్, డీఎస్పీ నవీన్ కుమార్, పీఎస్‌ఐ నవీన్‌కుమార్ తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment