![ప్రభుత్వం అందించిన వర్క్‌బుక్స్‌తో విద్యార్థులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/5/03nrl220-340154_mr.jpg.webp?itok=NnEhHaZF)
ప్రభుత్వం అందించిన వర్క్‌బుక్స్‌తో విద్యార్థులు
● అభ్యాసాల సాధనకు విద్యార్థులకు వర్క్‌బుక్స్ ● సామర్థ్యాలు పెరుగుతాయంటున్న ఉపాధ్యాయులు ● ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
నిర్మల్ ఖిల్లా: ప్రాథమిక తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల పెంపునకు చదవడం, రాయడం ప్రక్రియలు కీలకం. పుస్తక పఠనం, పరిశీలన, అవగాహన, క్రియేటివిటీ, ఆలోచనాత్మక అనుభవం వంటి విషయాలతోపాటు క్లిష్టమైన విషయాలను ఆకళింపు చేసుకోవడం చదవడం, రాయడం ద్వారా సాధ్యమవుతుంది. ఇదే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వర్క్‌బుక్స్ రూపొందించింది. వీటిని ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసింది. జిల్లాలోని 535 పాఠశాలలకు వర్క్‌బుక్స్ చేరుకున్నాయి. పాఠం పూర్తయిన వెంటనే అభ్యాసాలను ప్రాక్టీస్ చేసేలా వర్క్‌బుక్ రూపొందించారు.
విద్యార్థులకు ప్రయోజనం...
ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు తొలిమెట్టు శిక్షణ ద్వారా విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు అభ్యాస పుస్తకాల (వర్క్‌బుక్)లను అందించారు. ప్రతీ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత ఈ వర్క్‌బుక్‌లో దానికి సంబంధించిన డ్రిల్ ఉంటుంది. దీని ద్వారా సంబంధిత అంశంపై పూర్తి అవగాహనతోపాటు, విద్యార్థి సామర్థ్యాలు పెంపొందుతాయి.
ఏయే సబ్జెక్టులకంటే...
భాషాపరమైన తెలుగు, ఇంగ్లిష్‌తోపాటు గణిత పా ఠ్యాంశాలకు వర్క్‌బుక్‌లను పంపిణీ చేశారు. విద్యార్థులు పాఠం పూర్తయిన వెంటనే ఇందులో పొందుపర్చిన వర్క్‌షీట్‌లను సాధన చేస్తారు. ఉపాధ్యాయులు ఈమేరకు చొరవ చూపుతారు. ఫలితంగా పాఠంపై పూర్తి పట్టు సాధించే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రుల హర్షం...
వర్క్‌బుక్‌లలోనే ప్రాక్టీస్ చేయాల్సిన వర్క్‌షీట్లు పాఠాల వారీగా ఉన్నాయి. దీంతో విద్యార్థులకు సులభంగా ఉంటుంది. ప్రైవేటు పాఠశాలల్లోని హోంవర్క్ ప్రాక్టీస్ షీట్ల తరహాలోనే ప్రభుత్వ విద్యార్థులకు సైతం ప్రభుత్వం సరఫరా చేసిన అభ్యాస పుస్తకాలు ఉండడంతో జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment