![నృత్యం చేస్తున్న విద్యార్థినులు - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/1/31nrl417-604991_mr.jpg.webp?itok=DL10xBHA)
నృత్యం చేస్తున్న విద్యార్థినులు
నిర్మల్: 2024.. కాలగమనంలో వచ్చిన కొత్తసంవత్సరం. ఇంట్లోకి కొత్త క్యాలెండర్ వచ్చినట్లే.. మనసుల్లోకి కొత్త ఆశలు, సరికొత్త లక్ష్యాలూ వచ్చిచేరుతాయి. కాలచక్రంలో ఎన్నో ఆంగ్ల సంవత్సరాలు కదిలిపోతున్నా.. నయాసాల్ అంటే తెలియని ఉ త్సాహం. జరిగిందేదో జరిగిపోయింది.. పాత ఏడాది గడిచిపోయింది.. ఇక ఈ ఏడాదిలో కొత్తగా ఏదో సాధించాలన్న ఆరాటం ప్రతీ కామన్‌మ్యాన్‌లో కనిపిస్తుంది. ప్రతిఒక్కరూ ఎంతోకొంత మార్పు కోరుకోవడం సహజం. మనలాగే మన జిల్లా.. మార్పులు కోరుకుంటోంది. జిల్లావాసులు ఆశిస్తున్నట్లే అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తుంది. ఇందుకు తగ్గట్లు పాలకులు, అధికారులూ కొత్త ఏడాది లక్ష్యాలు పెట్టుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఎలాగైతే అభివృద్ధి కోరుకుంటున్నారో.. కొత్త ఏడాదిలో నిర్మల్ జిల్లా కూడా అన్నిరంగాల్లో మరింత ముందుకు వెళ్లాలని ప్రతిఒక్కరూ ఆశిస్తున్నారు. రాష్ట్రంలోనే నిర్మల్.. అంటే ఓ మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు.
‘కొత్త’మార్పు ఉండాలని..
కొత్త ఏడాది ప్రారంభానికి ఒక్కనెల ముందే రాష్ట్రంలో ప్రజలు కొత్తదనం కోరుకున్నారు. అందుకు తగ్గట్లు కొత్త సర్కారును ఎన్నుకున్నారు. జిల్లాలోనూ మూడు నియోజకవర్గాల్లో కొత్త ఎమ్మెల్యేలకు పట్టంకట్టారు. ఇక ప్రజలు ఎన్నుకున్న పాలకులు వారి అభీష్టానికి తగ్గట్లుగా నయాసాల్‌లో మార్పు చూపించాల్సిన బాధ్యత ఉంది. ఉమ్మడి జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే అభివృద్ధికి కావాల్సిన సానుకూల అంశాలు మన నిర్మల్‌కే ఎక్కువ. జిల్లాలో గోదావరి నది సరిహద్దుగా ఉంది. గోదావరి ఉపనదులైన కడెం, స్వర్ణ జిల్లా వరప్రదాయినుల్లా ప్రవహిస్తున్నాయి. సాగు, తాగునీటి రంగాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. హైదరాబాద్–నాగ్‌పూర్ ప్రధాన మార్గమైన ఎన్‌హెచ్–44, మరోవైపు మహారాష్ట్రలోని పలు ప్రధాన నగరాల నుంచి మంచిర్యాలవైపు వెళ్తున్న ఎన్‌హెచ్–61 రోడ్లకు కూడలిగా ఉంది. రోడ్డు, రవాణాపరంగా ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగించకుండా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరముంది. మెడికల్‌కాలేజీ ప్రారంభమైనా పూర్తిస్థాయిలో వైద్యం ఇంకా కలగానే ఉంది. విద్యాపరంగా జిల్లా చాలా వెనుకబడి ఉంది. ఇప్పటికే ఉన్నతవిద్య అందని ద్రాక్షగానే మిగిలింది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకువస్తే ఉపాధితో పాటు ఉత్పత్తి పెరిగి రైతులు, యువతకు లాభసాటిగా ఉంటుంది. కొత్త ఏడాదిలోనైనా జిల్లా పర్యాటక శోభతో విరాజిల్లాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. మొత్తం మీద తమ జీవితాలతో పాటు జిల్లా కొత్త మార్పులతో అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నారు.
ఈ ఏడాదంతా బాగుండాలె..
అనుకున్న పనులన్నీ జరగాలె..
అభివృద్ధి పరుగులు పెట్టాలె..
జిల్లా కొత్తపుంతలు తొక్కాలె..
అన్ని రంగాలూ బాగుపడాలె..
మార్పు కోరుతున్న జిల్లా ప్రజలు
![బేకరీలో కేక్‌లు కొనుగోలు చేస్తున్న యువతులు1](https://www.sakshi.com/gallery_images/2024/01/1/31nrl418-604991copy_mr.jpg)
బేకరీలో కేక్‌లు కొనుగోలు చేస్తున్న యువతులు
Comments
Please login to add a commentAdd a comment