● బతుకుదెరువుకు వెళ్లి మృత్యువాత పడుతున్న కార్మికులు ● నకిలీ ఏజెంట్ల వలలోపడి విలవిల.. ● అక్కడ ఉండలేక, ఇక్కడికి రాలేక నరకయాతన ● కుటుంబ సభ్యుల అరణ్యరోదన ● కొనసాగుతున్న వరుస ఘటనలు | - | Sakshi
Sakshi News home page

● బతుకుదెరువుకు వెళ్లి మృత్యువాత పడుతున్న కార్మికులు ● నకిలీ ఏజెంట్ల వలలోపడి విలవిల.. ● అక్కడ ఉండలేక, ఇక్కడికి రాలేక నరకయాతన ● కుటుంబ సభ్యుల అరణ్యరోదన ● కొనసాగుతున్న వరుస ఘటనలు

Published Sat, Aug 24 2024 12:22 AM | Last Updated on Sat, Aug 24 2024 12:22 AM

● బతు

ఖానాపూర్‌ మండలం గోసంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని నడింపల్లెకు చెందిన పుల్కం రాజేశ్వర్‌ ఉపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 8న గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుబాయ్‌లో ఉన్న బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పాత మామిడిపల్లికి చెందిన పత్తిపాక వెంకటేశ్‌ (41) ఉపాధి నిమిత్తం గతేడాది జూన్‌ 21న సౌదీ వెళ్లాడు. అక్కడే పనిచేస్తుండగా జూలై 3న ఫిట్స్‌ రావడంతో తోటి కార్మికులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అదే నెల 8న మృతి చెందాడు. 19 రోజులకు మృతదేహం స్వగ్రామం చేరుకుంది.

నిర్మల్‌ జిల్లా భైంసా మండలం కోతుల్‌గామ్‌ గ్రామానికి చెందిన సట్ల నరసయ్య జీవనోపాధికోసం ఏడాది క్రితం దుబాయ్‌కి వలస వెళ్లాడు. వారం రోజులక్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో తాను ఉంటున్న గదికే పరిమితమయ్యాడు. మంగళవారం తోటి కార్మికులు వెళ్లి చూడగా శవమై కనిపించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన మెండోళ్ల సుధాకర్‌ ఆరునెలల క్రితం జిల్లాకు చెందిన ఓ ఏజెంట్‌కు లక్షలు చెల్లించి విజిట్‌ వీసాపై బహ్రెయిన్‌ వెళ్లాడు. అక్కడ సరైన పని దొరకక, చేసిన పనికి వేతనం రాక నరకయాతన అనుభవించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 15న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు గల్ఫ్‌ కార్మిక సంఘాల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడకు చెందిన కునారపు వెంకటేశ్‌ (28) ఉపాధి కోసం గతేడాది ఇరాక్‌ దేశం వెళ్లాడు. నాలుగు నెలలు అక్కడ పనిచేశాడు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కృంగిపోయాడు. ఈ ఏడాది జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

విజిట్‌ వీసాలతో గాలం

గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగం అనగానే ఎగిరి గంతేస్తూ ఇక్కడి కార్మికులు సరైన నైపుణ్యం లేకుండానే ఫ్లైట్‌ ఎక్కి విదేశాలకు వెళ్లిపోతున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత సరైన నైపుణ్యాలు లేకపోవడంతో అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. దీనికి తోడు విజిట్‌ వీసాపై వెళ్లి అక్కడ నైట్‌ వాచ్‌మెన్‌గా, కాపలాదారులుగా, ఇతర షాపింగ్‌మాల్స్‌లో లేబర్లుగా, గొర్రెలు, మేకల కాపరులుగా పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. కంపెనీ వీసా పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేసి ఏజెంట్లు మోసం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్‌ దేశాలకు వలసబాట పడుతున్న కార్మికులకు సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిర్మల్‌ఖిల్లా: ‘దూరపు కొండలు నునుపు’ అనే చందంగా ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్‌ దేశాలకు వెళ్తే ఆర్థికంగా బాగుపడతామని జిల్లా నుండి ఒకరిని చూసి మరొకరు దుబాయ్‌, కువైట్‌, బహ్రెయిన్‌, తదితర దేశాలకు వలసబాట పడుతున్నారు. అలా వెళ్లినవారు అప్పుల బారినపడి అక్క డే తనువు చాలిస్తున్న ఘటనలు జిల్లాలో అనేకం క నిపిస్తున్నాయి. మృతదేహాల కోసం కుటుంబ స భ్యులు నెలల తరబడి ఎదురు చూడడం, ప్రభుత్వాలు, కార్మిక సంఘాల నాయకులను వేడుకోవడం వంటి ఉదంతాలు జిల్లాలో అనేకం కనిపిస్తున్నాయి.

నకిలీ వీసాలతోనే...

విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మ డి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి గల్ఫ్‌ దేశాలకు వలసలు పెరిగిపోతుండడంతో ఇటీవల ఏజెంట్ల సంఖ్య కూడా ఎక్కువైపోతోంది. గ్రామీణ ప్రాంతాలవారు గల్ఫ్‌ దేశాలబాట పట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో వారికి ఎక్కువ జీతాలను ఏరచూపుతూ వలవేస్తున్నారు. దీంతో నకిలీ ఏజెంట్ల బారినపడి అక్కడికి వెళ్లిన కార్మికులు తీవ్ర అపసోపాలు పడుతున్నారు. అక్కడ సరైన వేతనం లేక ఆర్థికంగా చితికి పోతున్నారు. గత్యంతరం లేక అక్కడే బలవన్మరణాలకు పాల్పడటమో, మనోవేదనతో గుండెపోటుకు గురికావడంతోనో తనువు చాలిస్తున్నారు.

ఉపాధి అవకాశాలు లేకనే..

ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్‌ దేశాల బాట పడుతున్న కార్మికులు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నారు. ఎప్పుడు స్వగ్రామానికి తిరిగి వస్తామో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఉమ్మడి జిల్లా నుండి ఎన్నో ఆశలతో కువైట్‌, సౌదీ అరేబి యా, ఖతార్‌, బహ్రెయిన్‌, దుబాయ్‌ తదితర గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్న కార్మికులు ఏజెంట్ల మోసాలతో వేదన అనుభవిస్తున్న తీరు ఇటీవల విడుదల చేస్తు న్న సెల్ఫీ వీడియోలు తెలియజేస్తున్నాయి. చేసిన పనికి సరైన వేతనం అందటం మాట అటుంచి తిరి గి ఇంటికి రావాలన్నా విమాన ప్రయాణ చార్జీలకు వేలాది రూపాయలు వెచ్చించలేక మానసిక ఒత్తిడికి గురై అక్కడే మృత్యువాత పడుతున్న ఉదంతాలు వరుసగా వెలుగుచూస్తున్నాయి.

దేవునిగూడలో వెంకటేశ్‌ శవపేటికపై పడి రోదిస్తున్న కుటుంబసభ్యులు(ఫైల్‌)

ప్రభుత్వ సహకారం అవసరం

గల్ఫ్‌ దేశాలకు వలసబాట పడుతున్న కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సహకారం అందించాలి. అనుమతి పొందిన ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. గల్ఫ్‌ దేశాల బాట పడుతున్న వారికి ఇక్కడే పలు రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తే వలసలు కూడా తగ్గుముఖం పడుతాయి. ఇక్కడే ఉపాధి అవకాశాలు పెంచుకునేలా చైతన్యం కల్పించాలి. గల్ఫ్‌ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

– స్వదేశ్‌ పరికిపండ్ల, ప్రవాసీమిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, నిర్మల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
● బతుకుదెరువుకు వెళ్లి మృత్యువాత పడుతున్న కార్మికులు ● 1
1/3

● బతుకుదెరువుకు వెళ్లి మృత్యువాత పడుతున్న కార్మికులు ●

● బతుకుదెరువుకు వెళ్లి మృత్యువాత పడుతున్న కార్మికులు ● 2
2/3

● బతుకుదెరువుకు వెళ్లి మృత్యువాత పడుతున్న కార్మికులు ●

● బతుకుదెరువుకు వెళ్లి మృత్యువాత పడుతున్న కార్మికులు ● 3
3/3

● బతుకుదెరువుకు వెళ్లి మృత్యువాత పడుతున్న కార్మికులు ●

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement