గొల్లమాడలో పెద్దపులి సంచారం
● అక్కడి నుంచి అంజనీ తండా అడవిలోకి.. ● పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు
నర్సాపూర్(జి): మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్దపులి పది రోజులుగా కుంటాల మండల అడవుల్లో సంచరించి శుక్రవారం రాత్రి నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ అటవీ ప్రాంతానికి చేరింది. శుక్రవారం వేకువ జామున కుంటాలలో మార్నింగ్ వాక్ వెళ్లిన యువకులకు, రైతులకు కనిపించిన పులి అక్కడ నుంచి గొల్లమాడ పెద్దచెరువు వద్దకు వచ్చినట్లు అటవీ అధికారులు తెలిపారు. శనివారం అక్కడి నుంచి పంట పొలాల మీదుగా గొల్లమాడ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ప్రాణహిత–చేవెళ్ల కెనాల్ పక్కనుంచి తిమ్మాపూర్(జి) గ్రామ శివారులోని దత్తాత్రేయ మందిరం పక్కనుంచి ఒర్రె ద్వారా అంజని తండా అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు స్థానికులు తెలుపడంతో అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించారు.
గాలింపు చర్యలు ముమ్మరం..
కుంటాల మండలం దౌనెల్లి అటవీ ప్రాంతం నుంచి మహారాష్ట్ర సరిహద్దు పంగర్‌పాడ్ అటవీ ప్రాంతంలో సంచరించిన పెద్దపులి శుక్రవారం రాత్రి నర్సాపూర్ (జీ) మండలంలోని గొల్లమాడకు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న గొల్లమాడ గ్రామ యువకుడికి పెద్దపులి కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. పులి సంరక్షణకు గొల్లమాడ, తిమ్మాపూర్(జి), అంజని తండా అటవీ ప్రాంతాల్లో రెండు బృందాలుగా ఎఫ్‌ఆర్‌వోలు రామకృష్ణ, వేణుగోపాల్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చేపట్టారు. శనివారం గొల్లమాడ పంట పొలాలు, చేలల్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు త్వరగా పూర్తి చేసుకుని రావాలని సూచించారు. మండలంలోని అంజనీ తండా గ్రామస్తులకు అధికారులు శనివారం రాత్రి అవగాహన కల్పించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు గుంపులు గుంపులుగా అలజడి చేస్తూ పనులకు వెళ్లాలని కోరారు. పంట పొలాలకు ఉచ్చులు, విద్యుత్ తీగలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. పులి గాలింపులో ఎఫ్‌ఆర్‌వో రామకృష్ణ, ఫ్లయింగ్ స్క్వాడ్ అనిత, డీఆర్వో నజీర్‌ఖాన్, ఎఫ్‌ఎస్‌వో అలేఖ్య, ఎఫ్‌బీవో సాయరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment