ఎట్టకేలకు ప్ర‘యోగం’..
● కాలేజీ అకౌంట్లలో నిధులు ● రూ.25వేల చొప్పున జమ
తరగతులు నిర్వహిస్తాం
ప్రయోగశాలల నిర్వహణ నిధులు ఇటీవలే విడుదలయ్యాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహిస్తాం. ఇందుకు వారిని సన్నద్ధం చేస్తున్నాం.
– జాదవ్ పరశురాం,
జిల్లా ఇంటర్‌విద్యాధికారి, నిర్మల్
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటివరకు ఆయా కళాశాలల్లో ప్రయోగ పరికరాలు, రసాయనాలకు సంబంధించి బడ్జెట్ రాకపోవడంతో ప్రాక్టికల్ క్లాసులు నిర్వహణ లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆయా కళాశాలల అకౌంట్లకు నిధులు జమ చేసింది. మరోవైపు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు రానున్న వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రస్తుతం 90 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టుల అధ్యాపకులు ప్రయోగాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించనున్నారు. వీటితోపాటు సంబంధిత విషయాలవారీగా రికార్డు బుక్కులనూ రాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో చేసిన జాప్యం కారణంగా నెలన్నర కాలంలో ప్రాక్టికల్స్ తరగతులు పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న వార్షిక ప్రయోగ పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
నిధుల విడుదలలో జాప్యంతోనే..
జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా, 2,200 మందికి పైగా ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్నారు. సెకండియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 30 మార్కుల చొప్పున ప్రయోగ పరీక్షలుంటాయి. వీటికోసం సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులు విద్యార్థులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ వరకు నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటివరకు కొన్ని కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు మొదలుకాలేదు. మరికొన్ని చోట్ల సంబంధిత అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌లు అవసరమైన రసాయనాలు, ప్రయోగ పరికరాలను సొంత ఖర్చులతో తెప్పించి తరగతులు నిర్వహించారు. తాజాగా ప్రాక్టికల్స్ నిర్వహణ ఖర్చులకు ఒక్కో కళాశాల అకౌంట్‌లో రూ.25 వేలు జమ చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment