● సేంద్రియసాగులో ‘స్వయం’ మహిళల సమీకృతం... ● జాతీయస్థాయి
నిర్మల్‌ఖిల్లా: వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్న రోజులివీ. ప్రభుత్వాలు ఎన్ని ప్రోత్సాహకాలు అందిస్తున్నా.. వ్యవసాయం చేసేవారు తగ్గిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో జిల్లాకు చెందిన స్వయం సహాయక బృందాల మహిళలు వ్యవసాయం చేయడమే కాదు.. సేంద్రియ విధానంలో విభిన్న పంటల మేలు కలయికతో సమీకృత సాగుచేస్తూ ఔరా అనిపిస్తున్నారు. వీరికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వెన్నుదన్నుగా నిలుస్తోంది. నిర్మల్ రూరల్ మండలంలో గల కొండాపూర్ గ్రామానికి చెందిన ‘గణపతి మహిళా స్వయం సహాయక సంఘం’ అతివలు చేస్తున్న సమీకృత సాగుకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది.
వినూత్నంగా సమీకృతం...
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి ప్రోత్సాహంతో కొండాపూర్ గ్రామ శివా రులోని ఎకరంనర పొలాన్ని లీజుకు తీసుకుని సమీకృత సాగువిధానాన్ని అమలుపరిచారు. స్థాని క ‘గణపతి స్వయం సహాయక మహిళా బృందం’ సభ్యులతోపాటు ఐకేపీ ఉద్యోగులు, సిబ్బంది, గ్రామీణాభివృద్ధిశాఖ సహకారంతో అందులో ఆర్గానిక్ పద్ధతిలో సమీకృత వ్యవసాయం చేపట్టారు. వరి, కూరగాయలు, ఆకుకూరలతోపాటు బీట్‌రూట్, క్యారెట్, పుదీనా, ఉల్లి, వెల్లుల్లి, వట్టివేరు వంటి వినూత్న పంటల పండించారు. దీనికి తోడుగా అక్కడే కొరమీను చేపలు, నాటు కోళ్లు, గొర్రెల పెంపకం చేపట్టి ఆదర్శంగా నిలిచారు. వచ్చిన సమీకృత సాగు దిగుబడులను కూడా స్వయంగా విక్రయించి, ప్రయోజనాలను ఎలా పొందవచ్చో నిరూపించి ఇతరుల్లో స్ఫూర్తిని నింపారు.
ఢిల్లీలో మార్మోగిన జిల్లా పేరు...
స్వయం సహాయక మహిళలు బృందంగా ఏర్పడి చేపట్టిన సాగుకు వెనక జిల్లా గ్రామీణ అభివద్ధి శాఖ అధికారుల కృషి ఎంతో ఉంది. మహిళలకు వెన్నుదన్నుగా నిలిచి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పద్ధతులు రాష్ట్రవ్యాప్తంగానే కాక దేశ రాజధాని ఢిల్లీలో జిల్లా పేరును మార్మోగేలా చేశారు. జిల్లా అధికారుల కృషి ఫలితంగా జాతీయస్థాయిలో ‘‘రెవల్యూషనరీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు’’ సాధించారు. మంగళవారం ఢిల్లీలో ప్రఖ్యాత పెప్సికో సంస్థ జాతీయస్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో కొండాపూర్ గ్రామానికి చెందిన గణపతి మహిళా స్వయం సహాయక సంఘం తరఫున కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా డీఆర్డీవో విజయలక్ష్మి పురస్కారం అందుకున్నారు.
స్ఫూర్తిదాయకం.. వీరి ప్రస్థానం...
గణపతి స్వయం సహాయక మహిళా సంఘంలో ఉన్న సభ్యులు అందరూ దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై వారికి కాస్త అనుభవం ఉండడం కూడా కలిసి వచ్చింది. డీఆర్డీవో జిల్లా శాఖ అధికారులు సూచనల మేరకు వ్యవసాయక్షేత్రంలో వివిధరకాల పంటలతోపాటు, పశుపోషణ, కోళ్లు, చేపల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధరంగాల పనులను చేపట్టారు. సేంద్రియ విధానంలోనే సాగు చేపట్టడం విశేషం.
మహిళల శ్రమకు గుర్తింపు...
రెండేళ్లుగా మహిళా సంఘాలు ఐకేపీ సిబ్బంది, జిల్లాస్థాయి అధికారులు సమష్టిగా శ్రమించడంతో ప్రస్తుతం ఈ గుర్తింపు దక్కింది. పరిమిత వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి క్రిమిసంహారకాలు, కృత్రిమ ఎరువుల ప్రమేయం లేకుండా సమీకృత పంటల సాగును చేపట్టాం. ఇందులో కోళ్లు, చేపల పెంపకం కూడా ఉండడంతో మంచి ఫలితాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో పురస్కారంతో మహిళల శ్రమకు గుర్తింపు దక్కింది. – విజయలక్ష్మి, డీఆర్డీవో
Comments
Please login to add a commentAdd a comment